ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. దీనికంటే ముందుగానే ఏపీలో ఆట మొదలైంది. గత వైకాపా ప్రభుత్వంతో అంటకాగిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై నిఘా మొదలైంది. ఇందులోభాగంగా, గత ప్రభుత్వ హయాంలో నూతన మద్యం పాలసీ పేరిట దోపిడీ పర్వానికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో శుక్రవారం సీఐడీ సోదాలు చేపట్టింది.
వాసుదేవరెడ్డి హైదరాబాద్ నగరంలోని నానక్ రామ్ గూడలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయాన్ని ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు.. వివిధ కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి వాసుదేవ రెడ్డి బలమైన మద్దతుదారుడుగా ఉన్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో మద్య డిస్టలరీలు అనధికార మార్గాల్లో వైకాపా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంత వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర అని, తద్వారా మద్యం రూపంలో వైకాపాకు భారీ ఆదాయం లభించిందన్న ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు, కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. పూనం మాలకొండటయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య ప్రస్తుతం సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈమె ఈ నెల 30వ తేదీతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రేవు ముత్యాలరాజు సీఎంవోలో కార్యదర్శి హోదాలో ఉండగా, నారాయణ భరత్ గుప్తా అదనపు కార్యదర్శిగా కొనసాగుతున్నార.
ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారుల సాధారణ పరిపాలన శాఖకి రిపోర్టు చేయాలని కొత్త సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెల్సిందే.