ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో భర్తపై దాడి చేసి పిల్లల కళ్ళెదుట గర్భిణి మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, బాధితురాలిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
ఇదిలావుంటే, అత్యాచార బాధితురాలికి వైకాపా నేతలు, మంత్రులు వరుసబెట్టి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్య మంత్రి విడదల రజినీ ఆమెను కలిసి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితురాలికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. పైగా, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూడటం దారుణమని మీడియాతో అన్నారు.
మరోవైపు, రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఏపీ హోం మంత్రి తానేటి వనితతో పాటు పురపాలక శాఖామంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎస్సీ కమిషన్ సభ్యులు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బాధితురాలిని పరామర్శించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.