ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వానికి మరో చెంపదెబ్బ తగిలింది. రాజధాని అమరావతి ప్రాంతంలో సేకరించిన భూమిలో రాజధానేతరులకు భూమి కేటాయిస్తూ జగన్ సర్కారు జారీ చేసిన జీవోకు హైకోర్టు బ్రేక్ వేసింది.
గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన 51 వేల మందికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం 1215 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా రాజధాని గ్రామాల్లోని పేదలకు మాత్రమే ఇక్కడి భూములు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉన్న విషయాన్ని రైతుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.
కాగా, ఇటీవలే కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపునకు నో చెప్పిన కోర్టు తాజాగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి భూముల కేటాయింపుపై జారీ చేసిన జీవోపైనా స్టే ఇచ్చింది. గత 9 నెలల కాలంలో జగన్ సర్కారు తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలు, జారీ చేసిన జీవోలపై హైకోర్టులు చుక్కెదరవుతున్న విషయం తెల్సిందే.