Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సవరణతో టిటిడిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి చట్టబ‌ద్ధ‌త‌?

Advertiesment
సవరణతో టిటిడిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి చట్టబ‌ద్ధ‌త‌?
విజయవాడ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:25 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్ర‌త్యేక ఆహ్వానితుల నియామ‌కం వ్య‌వ‌హారం వివాదంతో ప‌డ‌టంతో ప్ర‌భుత్వం దీనికి ప‌రిష్కార మార్గాన్ని ఆలోచించిన‌ట్లు తెలుస్తోంది. రెండు జీవోల ద్వారా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం ఇటీవల నియమించగా జీవోలపై హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా వారి నియామకానికి వీలుగా చట్ట సవరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు ఈనెల 28న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దేవాదాయశాఖకు చెందిన పలు చట్టాల సవరణలపై నిర్ణయం తీసుకోనున్నారు.
 
ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలు దేవాదాయశాఖలోని ఏ సెక్షన్‌ ప్రకారం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. దాంతో దేవాదాయ చట్టం 97కు సవరణ చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం ద్వారా తితిదే ప్రతిష్ఠ మరింత పెంచేందుకు వీలుంటుందని, భక్తులు, యాత్రికుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు ఇది దోహదపడుతుందని ప్రతిపాదిస్తున్నారు. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజు గడువు ముగిసే వారం ముందే నోటీసులు ఇవ్వనున్నారు. ఈమేరకు లీజుదారులు తప్పకుండా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం లీజుదారులు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా కోర్టులను ఆశ్రయిస్తుండటంతో దేవాదాయశాఖలోని సెక్షన్‌ 83ను సవరించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు, ఇతర భద్రత ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా... దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీవింగ్‌ ఏర్పాటుకు సెక్షన్‌ 12కు సవరణ చేయనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖను ఏర్పాటుచేసే ప్రయత్నాలపై చర్చించనున్నారని తెలిసింది.
 
దేవాదాయ శాఖలోని వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు, రెవెన్యూయేతర శాఖల నుంచి ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకునేలా చట్టసవరణకు ప్రతిపాదించారు. ఇప్పటివరకు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ క్యాడర్‌ అధికారులనే డిప్యుటేషన్‌పై తీసుకునే అవకాశముంది. తాజాగా ఇతర శాఖల నుంచి దేవాదాయ శాఖలోని పోస్టులకు సమాన క్యాడర్‌లో ఉండేవారిని తెచ్చేందుకు రంగం సిద్ధంచేశారు. విషయం  వెలుగులోకి రావడంతో ఉద్యోగులు నిరసన వ్యక్తంచేశారు. వారి వినతిపై స్పందించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌  ప్రతిపాదనను నిలిపేస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన షెడ్యూలు ఖరారు