ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
గత కొద్ది నెలలుగా ఉద్యోగుల పిఆర్సీపై వివాదం నడుస్తోంది. ప్రభుత్వంతో పలు మార్లు చర్చల అనంతరం, చివరికి నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఎన్జీవో సంఘాలు సమావేశం అయ్యాయి. ఉద్యోగులు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకుంటే, ప్రభుత్వం తమ ఆర్ధిక, బడ్జెట్ సమస్యల్నిఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పుకుంది. చివరికి మీకు మంచే చేస్తా, ప్రభుత్వానికి సహకరించండని సీఎం జగన్ విజ్నప్తి కూడా చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 ఫిట్మెంట్ ప్రకటించారు. అలాగే,
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్ల కు పెంచుతున్నట్లు తెలిపారు. జనవరి 1 నుంచి కొత్త జీతాలు అమలు అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అలాగే, పీ ఆర్ సీ 1- 7-2018 నుండి అమలు అవుతుందని తెలిపింది.