Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ అధినేతగా ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు... బాబు - పవన్ అభినందనలు

Advertiesment
pawan kalyan
ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఆయనకు అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదివారమే ప్రధాని మోడీకి అభినందన తెలిపారు.
 
డిప్యూటీ సీఎం పవన్ మాత్రం సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మొత్తం 8931 రోజులు నిరంతరాయంగా ప్రభుత్వ అధినేతగా సేవలు అందించడంపై ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ప్రస్థానం కేవలం పదవీకాలానికి సంబంధించినది కాదు. ఇది తిరుగులేని సంకల్పం. అలుపెరగని అంకితభావం. భారత సేవకే అంకితమైన జీవితం. అట్టకుడు స్థాయి నాయకత్వం నుంచి ప్రపంచ వేదికపై దేశానికి మార్గనిర్దేశం చేసే వరకు దేశమే ప్రథమం అనే స్పష్టమైన దార్శనికతతో ఆయన పాలనను పునర్నిర్వచించారు' అని పవన్ కళ్యాణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. సుధీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోడీ ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవీ కాలాలను కలుపుకుంటే ఆయన అత్యధిక కాలం అంటే 8,931 రోజుల పాటు ప్రభుత్వ అధినేతగా పని చేసిన వ్యక్తిగా నిలిచారు. దీంతో ఇప్పటివరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న ఈ రికార్డును ప్రధాని మోడీ అధిగమించారు. చామ్లింగ్ సిక్కిం ప్రభుత్వ అధిపతి (ముఖ్యమంత్రి)గా 8,930 రోజులు పనిచేశారు. 
 
గత 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అయ్యే వరకు ఆ పదవిలో ఉన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. గుజరాత్‌కు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మోడీ నిలిచారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవమున్న ప్రధాని కూడా ఆయనే.
 
'దేశ స్వాతంత్ర్యం అనంతరం జన్మించి, దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేత కూడా మోడీయే కావడం గమనార్హం. కేంద్రంలో రెండుసార్లు పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేసుకొని, మూడోసారి అధికారం చేపట్టిన కాంగ్రెసేతర పార్టీ నేతగా రికార్డు నెలకొల్పారు. వరుసగా 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీని మోడీ విజయపథంలో నడిపించారు. దీంతో మూడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి విజయాన్ని సాధించిన నెహ్రూ రికార్డును సమం చేశారు.
 
గతేడాది జులైలో మోడీ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి వరుసగా దేశంలో అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచిన విషయం తెల్సిందే. వరుసగా ఆరు ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోడీ, 2002, 2007, 2012లలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి సీఎం అయ్యారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మటన్ ఉడకలేదు.. యజమానిపై కేసు నమోదు చేయండి.. ఠాణాలో రచ్చ చేసిన తాడిపత్రివాసి