ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుంకీ ఏనుగుల కేంద్రం ఏర్పాటైంది. చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
ఈ కేంద్రానికి కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులను రప్పించినట్టు పవన్ కల్యాణ్‌కు అధికారులు తెలిపారు. వీటి ద్వారా జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో వివరించారు. కుంకీ ఏనుగుల విన్యాసాలను పవన్ కల్యాణ్ తిలకించారు. వాటికి ఆహారం తినిపించారు.
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా, ఆయన ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏనుగులు వరుస క్రమంలో వచ్చి కవాతు నిర్వహించాయి. ఈ దృశ్యాలను పవన్ కళ్యాణ్ తన మొబైల్ ఫోనులో రికార్డు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.