ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి అభినవ కృష్ణదేవరాయ బిరుదును పుట్టిగె శ్రీ కృష్ణ మఠం శ్రీ శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ప్రదానం చేసారు. శ్రీ కృష్ణదేవరాయలు ధర్మాన్ని రక్షించి, దేవాలయాలు, కళలు మరియు సాహిత్యాన్ని ప్రోత్సహించినట్లే, పవన్ కళ్యాణ్ గారు కొత్త తరాన్ని విశ్వాసం, సంస్కృతి, న్యాయం కోసం నిలబడటానికి ప్రేరేపిస్తున్నారనీ స్వామీజి కొనియాడారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నాటక రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉడుపిని సందర్శించారు. ఈ పవిత్ర భూమి భారతదేశపు ఆధ్యాత్మిక శక్తి కేంద్రం అని అభివర్ణించారు. శ్రీకృష్ణుడు కొలువై ఉండే ఈ నేలపై అడుగుపెట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. బృహత్ గీతోత్సవం శుభ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుడు కొలువైన, ముఖ్యప్రాణ హనుమంతుడు శాశ్వత సంరక్షకుడిగా నిలిచిన, జగద్గురు మధ్వాచార్యులు తన జ్ఞానంతో ఎందరినో చైతన్యపరిచిన పవిత్ర భూమి ఉడుపి. మన నాగరికతకు ఆత్మలాంటి భగవద్గీత సందేశాన్ని జరుపుకునేందుకు భక్తులతో కలవడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.
శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దార్శనిక మార్గదర్శకత్వంలో ఈ పవిత్ర భూమి చారిత్రక ఆధ్యాత్మిక ఉద్యమాలకు సాక్షిగా నిలుస్తోందన్నారు. కోటి భగవద్గీత చేతిరాత ప్రాజెక్టు నుంచి లక్ష కంఠ పారాయణం వరకు చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు. భగవద్గీత సందేశం మన చర్యలకు మార్గనిర్దేశం చేసి, సమాజాన్ని బలోపేతం చేసి, జాతీయ స్ఫూర్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై హింద్ అంటూ తన సందేశాన్ని ముగించారు.