తను కొన్నిసార్లు కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ కోల్పోతుంటానని డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే... ఒక పనిని ఫలవంతంగా చేయాలంటే ఒక చిన్నసైజు యుద్ధం చేయాలి. మనం కూర్చునే చెక్క టేబుల్ కావాలంటే చెట్లు నరకాలి, ఇంకా ఆ తర్వాత ఎంతో పనిచేస్తే కానీ ఆ టేబుల్ మనదగ్గరకి రాదు. అలాగే సినిమా చేయాలంటే ముఖ్యంగా నిర్మాత నలిగిపోతాడు. ఎందరినో ఒప్పించాలి.
థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలనన్న నమ్మకంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాత సినిమా తీస్తారు. ఇందుకోసం కొన్నిసార్లు వాళ్లు ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తారు. ఆ ఫైనాన్షియర్లు కూడా సినిమా నిర్మాతకు లాభాలు వచ్చి తమకు నాలుగు రూపాయలు వస్తాయనే నమ్మకంతో ఇస్తారు. ఇంతా చేసి సినిమా తిరగబడితే ఫలితం మరోలా వుంటుంది. ఆ సందర్భం నిర్మాతకు ఎలా వుంటుందో చెప్పలేం. ఆరెంజ్ సినిమా టైంలో నేను ఒకరిద్దరికి 10 లక్షల చెక్కులు ఇచ్చాను అంటూ పవన్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.