ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్ర హోంశాఖా బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే, ఆయన సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి మాత్రం చినరాజప్పతో పాటు.. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తేరుకోలేని షాకిచ్చారు.
నిమ్మకాయల లక్ష్మణమూర్తి (బాపూజీ) జనసేన పార్టీలో చేరారు. శనివారం పెదగాడవిల్లిలో జనసేన పార్టీ గుర్తు గ్లాజుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన పార్టీలో చేరారు. లక్ష్మణమూర్తి ఏ పార్టీలోను క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ఆయన పార్టీలో చేరికపై జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జనసేన మాత్రమే చురుకైన పాత్రను పోషిస్తుందన్నారు. అందుకే తాను జనసేన వైపు మొగ్గు చూపినట్టు చెప్పారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విధి విధానాలు నచ్చడం వల్లే తాను జనసేన వైపు మొగ్గు చూపినట్టు తెలిపారు.
అంతేకాకుండా, తమ స్వగ్రామం పెదగాడవిల్లి అయినప్పటికీ పొరుగున ఉన్న చినగాడవిల్లి, మునిపల్లి గ్రామాల్లోని కాపు సామాజికవర్గం తమ కుటుంబానికి మూడున్నర దశాబ్దాలుగా అండగా ఉన్నారని అన్నారు. ఈ కారణంగానే తన తండ్రి వెంకటరంగయ్య అనంతరం సోదరుడు జగ్గయ్యనాయుడు సొసైటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా కొనసాగుతున్నారన్నారు.