Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కనిగిరి బాధితురాలికి అండగా ప్రభుత్వం... రూ.10 లక్షలు డిపాజిట్, ఇల్లు కూడా...

అమరావతి: కనిగిరిలో విద్యార్థినిపై వేధింపులకు పాల్పడి వాటిని సోషల్ మీడియాలో జోడించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఆ బాధితురాలిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇందుకు సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని రాష్ట్ర మహ

కనిగిరి బాధితురాలికి అండగా ప్రభుత్వం... రూ.10 లక్షలు డిపాజిట్, ఇల్లు కూడా...
, బుధవారం, 4 అక్టోబరు 2017 (21:12 IST)
అమరావతి: కనిగిరిలో విద్యార్థినిపై వేధింపులకు పాల్పడి వాటిని సోషల్ మీడియాలో జోడించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఆ బాధితురాలిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇందుకు సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడును కనిగిరి బాధితురాలు, ఆమె తల్లిదండ్రులతో కలిసి సచివాలయంలో కలిసినట్లు ఆమె తెలిపారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు... బాధితురాలితో మాట్లాడారన్నారు. 
 
ఆమెకు ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామని సీఎం చెప్పారని నన్నపనేని తెలిపారు. ఆమె చదువుకునే చోట బాధితురాలి తల్లిదండ్రులకు ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. తక్షణమే బాధితురాలి పేర రూ.10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్నట్లు హామీ ఇచ్చారని తెలిపారు. డిగ్రీ పూర్తయిన తరవాత ప్రభుత్వ ఉద్యోగమిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారన్నారు. ఆమె తమ్ముడికి కూడా కావాల్సిన చోట ఉచితంగా విద్యనందజేస్తామని సీఎం తెలిపారన్నారు. కనిగిరి బాధితురాలికి సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారని నన్నపేని తెలిపారు. 
 
కనిగిరి దుర్ఘటనతో కుంగిపోవొద్దని, ధైర్యంగా ఉండాలని, అన్నివిధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చారని వెల్లడించారు. ఎవరో వస్తారని కాకుండా, వేధింపులకు పాల్పడే వారిపై మహిళలే తిరగబడాలని సీఎం చెప్పారన్నారు. తీవ్ర నిరాశలో కూరుకుపోయిన బాధితురాలు సీఎం చంద్రబాబు కౌన్సెలింగ్‌తో ధైర్యం తెచ్చుకుందన్నారు. మహిళల సంక్షేమంపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో... ఇంతకుముందు తాడిపత్రి, పాలకొల్లు, నర్సాపురం ఘటనలతో పాటు కనిగిరి బాధితురాలికి సీఎం చంద్రబాబునాయుడు అందించిన సహకారం మరోసారి రుజువు చేసిందని రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. 
 
మహిళల పట్ల సీఎం చంద్రబాబు ఆపద్భాందుడిలా ఉన్నారన్నారు. సీఎంకు రాష్ట్ర మహిళా కమిషన్ తరఫున నన్నపనేని రాజకుమారి కృతజ్ఞతలు తెలియజేశారు. కనిగిరి దుర్ఘటన నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, నిర్భయ చట్టం కింద కేసులు నమోదుచేశారన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి తాట తీస్తామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కనిగిరి దుర్ఘటనలో బాధితురాలికి అండగా ఉన్న పోలీసులకు, మీడియాకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
బాధితురాలు మాట్లాడుతూ, కనిగిరి దుర్ఘటనతో తీవ్రంగా కుంగిపోయిన తనకు సీఎం చంద్రబాబునాయుడు అండగా నిలిచారన్నారు. చదువుకోడానికి, పెళ్లికి కూడా సీఎం సాయం చేస్తానన్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిదన్నారు. నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు ప్రొఫెసర్‌లా, మానవతావాదిలా బాధితురాలిలో ధైర్యాన్ని నూరిపోస్తూ, అండగా ఉంటామని భరోసా ఇచ్చారన్నారు. నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ తరఫున సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కనిగిరి సీఐ సుబ్బారావు మాట్లాడుతూ, ఇప్పటికే నిందితులను అరెస్టు చేసి, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఒంగోలులో చిన్నారి హత్యకు కారకుడైన నిందితుడిని కూడా అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి, బాధితురాలి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్