కన్నతండ్రి మరణించాడని తెలిసినప్పటికీ ఓ తాగుబోతు కన్నెత్తిచూడలేదు. దీంతో అధికారులో పెద్ద మనసుతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన చీరాల శ్రీనివాసరావు (60), అన్నపూర్ణ భార్యాభర్తలు. వీరి కుమారుడు సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. మూడు నెలల క్రితం అన్నపూర్ణ మరణించారు. సురేశ్‌కు గతంలో వివాహం కాగా.. భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు.
ఈ నెల 6న తండ్రి శ్రీనివాసరావు అనారోగ్యానికి గురికావడంతో.. సురేశ్ పర్చూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి వెళ్లిపోయాడు. చికిత్స పొందుతూ అతడు ఈ నెల 7వ తేదీన మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో ఆసుపత్రి అధికారులు పర్చూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎస్ఐ జీవీ చౌదరి నూతలపాడులో విచారించగా.. సురేశ్ మద్యానికి బానిసయ్యాడని, బందువులు చీరాలలోని హస్తినాపురంలో ఉంటారని తెలిసింది. దీంతో బంధువులకు సమాచారం ఇచ్చి.. సురేశ్ కోసం పోలీసులు గాలించారు. ఆదివారం సురేశ్‌ను గుర్తించి.. బంధువుల ఆధ్వర్యంలో మృతదేహం అప్పగించారు.
దహన సంస్కారాలకు తన వద్ద డబ్బుల్లేవని సురేశ్ చెప్పడంతో.. తమవంతుగా పోలీసులు, పంచాయతీ అధికారులు ఆర్థిక సాయం చేశారు. అనంతరం పర్చూరు హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.