ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఏఐ టూల్ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచి ఏది నిజమో ఏది అవాస్తవమో తెలియక తికమకపడుతున్నారు. వార్తను ప్రజలకు అందజేయాలన్న తొందరలో కొన్ని మీడియా హౌసులు ఏఐ జనరేటెడ్ వీడియోలను చూసి, అదే నిజం అనుకుని తప్పులో కాలేస్తున్నారు. తాజాగా అలాంటి ప్రచారం జరిగింది. కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్... డ్రైవర్ బిగ్ బాస్ చూస్తూ నడిపాడు. అందువల్లనే ప్రమాదం జరిగిందంటూ వార్తలు రాస్తున్నారు. ఐతే ఇది వాస్తవం కాదనీ, బైక్ నడిపిన వ్యక్తి వల్లనే ఈ ఘోరం జరిగిందని ఇప్పటికే పోలీసులు వివరించారు.
మరోవైపు వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి, తరువాత జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వేమూరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుని 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
భయానక దృశ్యాలు, నివేదికలు మొత్తం రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. బస్సును అక్రమంగా సీటర్ వాహనం నుండి స్లీపర్ వాహనంగా మార్చారని, దాని రిజిస్ట్రేషన్‌లో కూడా అవకతవకలు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటన తర్వాత, కేసులో ఏ1గా డ్రైవర్ లక్ష్మయ్య, బస్సు యజమాని వేమూరి వినోద్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
నిర్లక్ష్యం, భద్రతా నిబంధనలను పాటించకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఢీకొన్న తర్వాత డ్రైవర్ వెంటనే తమకు సమాచారం ఇచ్చి ఉంటే ఎక్కువ మంది ప్రయాణికులను రక్షించేవారని ప్రత్యక్ష సాక్షులు తెలియజేసారు.