కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులోని లగేజి క్యాబిన్లో వున్న మొబైల్ ఫోన్ల పార్సిల్ కు మంటలు అంటుకుని అది బాంబులో పెనువిస్ఫోటనం చెందటంతో భారీ ప్రాణనష్టం జరిగినట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. రోడ్డుపై పడి వున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టగానే బైక్ ఆయిల్ ట్యాంక్ మూత ఊడింది. బస్సు అత్యంత వేగంతో బైకుని ఈడ్చుకెళ్లడంతో నిప్పు రవ్వలు చెలరేగాయి. దాంతో క్రమంగా మంటలు అంటుకున్నాయి.
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఆ మంటలు బస్సు లగేజీ క్యాబిన్లో వున్న 400 మొబైల్ ఫోన్ల పార్సిల్ కు అంటుకున్నాయి. ఆ మొబైల్ ఫోన్లలోని బ్యాటరీలకు మంటలు తగలడంతో అవి ఒక్కసారిగా బాంబు విస్ఫోటనం చెందినట్లు పేలిపోయాయి. సరిగ్గా లగేజీ క్యాబిన్ పైన బెర్తుల్లో నిద్రించేవారు ఈ ప్రమాదం నుంచి బైటపడలేకపోయారు. సజీవంగా ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. భారీ మోత విన్న డ్రైవర్ కిందకి దిగి వెనుక వైపుకి వెళ్లి చూచాడు. అప్పటికే ముందుభాగం అంతా దగ్ధమైపోతోంది.
	 
	భారీగా అగ్నికీలలు ఎగసిపడుతుండటంతో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు కిందికి దిగేందుకు ప్రయత్నించినా డోర్ తెరుచుకోలేదు. దాంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికుల వాహనాల్లో సరుకు రవాణా చేయకూడదు. ఐనా చాలా ప్రైవేట్ వాహనాలు ఈ పని చేస్తూనే వున్నాయి. ఈ కారణంగా కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.