మాజీ మంత్రి పి.జనార్థన్ రెడ్డిని చంపిందే కాంగ్రెస్ పార్టీ అని, పీజేఆర్ కుటుంబానికి రాజకీయాల్లో చోటు లేకుండా చేసింది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, భారాస నేత జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఆదివారం హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, పీజేఆర్‌ను చంపిందే కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లో ఆయన కుటుంబానికి స్థానం లేకుండా చేసింది రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.
ఇపుడు దగ్గరివాళ్లు చెప్పినా వినే పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి లేరని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ప్రశ్నిస్తే పాలన మీరే చేయండంటూ ఎదురుదాడికి దిగుతున్నారని, అలాంటప్పుడు అధికారం నుంచి దిగిపోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి కంటే ఎవరైనా బాగానే పాలన చేస్తారని ఎద్దేవా చేశారు.
రెండేళ్లలో నిర్మాణ రంగాన్ని ఖతం చేశారని విమర్శించారు. బయటివాళ్లకు అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదని, పార్టీలో ఉన్న వ్యక్తులకే ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. నిన్నటిదాకా భట్టి విక్రమార్క మాత్రమే సీఎం రేసులో ఉండేవారని, ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా పోటీలో ఉన్నారని అన్నారు.
సర్పంచ్ ఎన్నికలకు తిరిగినట్లు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ సందుసందుకు తిరిగారు. ప్రెస్‌క్లబ్ పబ్‌లా కనిపిస్తోందని.. స్టార్ హోటల్‌లో మీట్ ది ప్రెస్ పెట్టారు. రూ.3 వేల కోట్లతో ఉస్మానియా, 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం, ఆర్టీసీకి రూ.7 వేల కోట్ల లాభం తెచ్చినట్లు చెప్పుకొన్నారు. 20 వేల నోటిఫికేషన్లు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అసలు ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా? నిరుద్యోగులు జూబ్లీహిల్స్‌లో నామినేషన్ వేసి కాంగ్రెస్‌ను ఓడించాలని తిరుగుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జోస్యం చెప్పారు.