ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ దాదాపు వెయ్యి కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 31,325 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 997 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 8,99,812కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలోనే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 181 కేసులు నమోదయ్యాయి.
అత్యల్పంగా విజయనగరంలో 4 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం మధ్యాహ్నం బులెటిన్ విడుదల చేసింది. ఇక, ఆరోగ్య శాఖ మరో షాకింగ్ విషయం చెప్పింది. 24 గంటల్లో కరోనా చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందినట్లు వెల్లడించింది. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున మరణించారని పేర్కొంది.
దీంతో రాష్ట్రంలో కోవిడ్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,210కి చేరింది. కాగా, ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం గమనార్హం. అలాగే ఒక్క రోజులో కరోనా నుంచి 282 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 6,104కు పడిపోయాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,50,21,363 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
అలాగే కృష్ణాజిల్లాలో సోమవారం ఒక్కరోజే 110 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 50వేల కేసులు దాటాయి. కరోనా సెకండ్ వేవ్ బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, యువత ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఉండడంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సచివాలయాల్లో కరోనా వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.