Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సఫాయి కర్మచారీలకు పధకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ఆదర్శం

Advertiesment
సఫాయి కర్మచారీలకు పధకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ఆదర్శం
, శనివారం, 19 అక్టోబరు 2019 (19:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సఫాయికర్మచారి కార్మికులు కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జాతీయ సఫాయికర్మచారీ కమిషన్ ఛైర్మన్ మనోహర్ వాజ్ భాయ్ జాలా పేర్కొన్నారు.

శనివారం విజ‌య‌వాడ‌లోని రాష్ట్ర ప్ర‌భుత్వ అతిథిగృహంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల సహకార, ఆర్ధిక కార్పోరేషన్ లిమిటెడ్, బ్యాంకర్లతో నిర్వ‌హించిన సమీక్షా సమావేశంలో మనోహర్ వాజ్ భాయ్ జాలా మాట్లాడుతూ సఫాయి కర్మచారీల్లో అధికశాతం మంది నిరక్షరాస్యులుగా ఉంటారని వారికి ప్రభుత్వాలు అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన లేకపోవడం వలన దళారులపై ఆధారపడుతున్నారన్నారు.

అధికశాతం ద‌ళారుల కార‌ణంగా ఆర్ధికంగా మోసపోవడం తమ దృష్టికి వచ్చిందన్నారు. సఫాయికర్మచారీలుగా పనిచేసే కార్మికులకు కనీసవేతనాలను అమలు చేయడంతో పాటు పండుగ సెలవులను కూడా వాడుకునే వెసులుబాటును కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ఆయా రంగాల్లో పనిచేసే వారికి శాశ్వత ఉపాధి కార్యక్రమాలను అందించాల్సిందని, ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ వంటి ఆర్థిక చేయూతను అందించడంతో పాటు ఫింఛను పధకాలను కూడా వర్తింప చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వం అందించే పధకాలు నేరుగా సఫాయికర్మచారి లబ్దిదారులకు అందించే దిశలో అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు.

అందుకోసం ఆయా కుటుంబాలకు చెందిన వ్యక్తులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో పాటు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని మనోహర్ వాల్జీ భాయ్ జాలా పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, పనిగంటల విషయంలో మానవతా ధృక్పధంతో వ్యవహరించాల్సి ఉందని అధికారులకు సూచించారు.

సఫాయికర్మచారీలుగా పనిచేసే కుటుంబాలు మురికివాడలలో నివాసాలు ఉంటున్నాయని వారికి స్వంత ఇంటిని కల్పించేదిశలో చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మురుగు వ్యవస్థ లేకుండా అభివృద్ధి పరిచే దిశలో తగిన కార్యాచరణ ప్రణాళికలతో మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఛైర్మన్ సూచించారు.

లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. సమాజం నుంచి సఫాయికర్మచారీ వ్యవస్థను నిర్మూలించి మంచి జీవితాలు అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోఢి కృతనిశ్చయంతో ఉన్నారని అందుకు అనుగుణంగానే ఎన్నో పధకాలను అమలు చేయడం జరుగుతోందని వాటిని క్షేత్రస్థాయిలో సంబంధిత లబ్దిదారులకు చేరవేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

ప్రభుత్వాలు అందిస్తున్న పధకాల విషయంలో దళారీల పాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని ఆయన కోరారు. బ్యాంకర్లు రుణాలు మంజూరు విషయంలో దళారీ వ్యవస్థలను ప్రోత్సహించవద్దని చైర్మన్ హితవు పలికారు. అటువంటి కేటగిరీల్లోని లబ్దిదారులకు రుణ సదుపాయాలు కల్పించే సందర్భంలో గ్యారంటీని, సెక్యూరిటీలు వంటి నిబంధనలు పెట్టకుండా స్వచ్చంధంగా పధకాలను వారికి అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

సఫాయికర్మచారీల లబ్దిదారులతో మెగా మేళాను నిర్వహిస్తే తాను తప్పకుండా హాజరు అవుతానని తెలిపారు. 
రాష్ట్రంలో సఫాయికర్మచారీల వృత్తి కొనసాగిస్తున్న వ్యక్తులు, కుటుంబాలకోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న పధకాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె. హర్షవర్ధన్ ఛైర్మన్‌కు వివరించారు.

2015-19 మధ్యకాలంలో జాతీయ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ డవలప్ మెంట్ కార్పోరేషన్ రుణ పధకం ద్వారా 7 వేల 667 మంది లబ్దిదారులకు 235 కోట్ల మేర సహకారాన్ని అందించగలిగామన్నారు. ప్రత్యేక ఆర్థిక చేకూర్పు పధకం క్రింద 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 5892 మంది లబ్దిదారులకు 189 కోట్ల మేర చేయూతను అందించ గలిగామన్నారు.

2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి సఫాయికర్మచారీలకు సంపూర్ణ ఆర్థిక చేకూర్పు అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వయం ఉపాధి కార్యక్రమాల క్రింద మూడు లక్షల లోపు రుణాలను అందించడంలో, 60 శాతం సబ్సిడీ, మూడు నుంచి ఐదు లక్షల లోపు రుణాలకు 50 శాతం సబ్సిడీ అందిస్తున్నామన్నారు.

ఇందులో లబ్దిదారుని వాటా కేవలం రెండు శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని మిగిలిన మొత్తాన్ని యన్ యస్ పిడియఫ్ సి రుణాలుగా అందించడం జరుగుతోందన్నారు. పవర్ ఆటో (గార్బేజ్) కోసం 60 శాతం సబ్సిడీ, డ్రెయినేజీ క్లీనర్ కోసం 35 శాతం సబ్సిడీ, ప్యాసింజరు ఆటోకు 60 శాతం సబ్సిడీ, ట్రాక్టరు కం ట్రైలర్‌కు 40 శాతం సబ్సిడీ, పాసింజరు వాహనాలకు (కార్లు) 40 శాతం సబ్సిడీ, ఇన్నోవా వాహనానికి 30 శాతం సబ్సిడీ అందిస్తున్నామన్నారు.

కమిటీ చేసిన సూచనలను తప్పకుండా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. స‌మీక్షా సమావేశంలో ఏజీయం అజయ్‌పాల్, యల్‌డియం రామ్మోహనరావు, సప్తగిరి బ్యాంకు ఆజ్యం రామకృష్ణ, యస్‌యల్ బిసి కార్యనిర్వాహణాధికారి పివి రమేష్, ప్రసాద్, రామచంద్రరావు, ఇ.మురళీ, యస్.సి. కార్పోరేషన్ జేడి ప్రసాద్, యస్‌సి కార్పోరేషన్ ఇఓ కె.టి. ఫణీంద్రాచార్య, ఛైర్మన్ సెక్రటరి నరైన్‌దాస్, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరి టు ఛైర్మన్ మహేంద్ర ప్రసాద్, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయికర్మచారి సలహాదారు పూరన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాణాసంచా త‌యారీ కేంద్రాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించాలి.. జ‌గ‌న్ ఆదేశాలు