ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు హస్తినబాట పట్టనున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మాకొట్టిమరీ ఢిల్లీ వెళ్లిన సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు ఆయన హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లనుండటం చర్చనీయాంశంగా మారింది.
కాగా, మంగళవారం విశాఖపట్టణం వేదికగా జరిగిన జీ20 సదస్సులో ఆయన పాల్గొన్నారు. విదేశీ ప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ప్రసంగిస్తారు. రాత్రికి తాడేపల్లికి చేరుకుంటారు.
ఆ తర్వాత బుధవారం ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ఒక రోజు రాత్రి బస చేసి మరుసటి రోజున ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. అయితే, ఈ పర్యటనలో ఆయన ఎవరితో సమావేశంకానున్నారు, ఏఏ అంశాలపై చర్చిస్తారు అనే వివరాలు తెలియాల్సి వుంది. గడిచిన రెండు వారాల్లో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.