అనంతపురం జిల్లా రాజకీయాల్లో బుధవారం ఆసక్తికర దృశ్యం ఒకటి కనిపించింది. బద్దశత్రువులుగా ఉండే పరిటాల కుటుంబం, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కటిగా కనిపించారు. పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్ రెడ్డిలు ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఆత్మీయంగా పలుకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన రాయలసీమ జనం మురిసిపోతున్నారు.
అయితే ఇందులో స్పెషల్ ఏముందని చాలా మంది అనుకోవచ్చు. కానీ, ఒక్కసారి ఈ రెండు కుటుంబాల గత చరిత్ర చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రత్యేక దృశ్యమే అని చెప్పాలి. ఒకప్పుడు అనంత జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేది. అప్పుడు జేసీ బ్రదర్స్‌ది కాంగ్రెస్. పరిటాల రవి వర్సెస్ జేసీ బ్రదర్స్. ఓ రేంజ్ హైవోల్టేజ్ పాలిటిక్స్ నడిచేవి.
ముఖ్యంగా పరిటాల రవి హత్య కేసు విషయంలోనూ అప్పట్లో జేసీ ఫ్యామీలపై ఆరోపణలు వచ్చాయి. అయితేపరిస్థితులు మారాయి. జేసీ బ్రదర్స్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు విభేదాలు కొనసాగినా ఇటీవలికాలంలో ఈ రెండు కుటుంబాలు ఒకటయ్యాయి. దీంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.