ఎయిడెడ్ పాఠశాలను ప్రైవేటుగా మార్చొద్దంటూ విద్యార్థులు ఉద్యమించారు. దీనికి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ తోడవటంతో ఆందోళన ఉధృతం అయింది. అనంతపురం ఎస్.ఎస్.బి.ఎన్. కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వ ఆధీనంలోనే సాయిబాబా విద్యా సంస్థలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థులు ఆందోళన చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఓ విద్యార్థిని తలకు గాయం అయింది. దీనితో రెచ్చిపోయిన విద్యార్థులు కళాశాల గేటు వేసి ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి విద్యార్థులను చెల్లాచెదురు చేసి, విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు.
అనంతపురం ఎస్.ఎస్.బి.ఎన్. కళాశాల వద్ద పోలీసులు లాఠీ చార్జి చేయలేదని జిల్లా పోలీసు శాఖ ఒక ప్రకటనలో ఖండించింది. విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా ఆటంకపరుస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై కొందరు రాళ్ళు రువ్వారని చెప్పారు. ఈక్రమంలో పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వగా, ఓ విద్యార్థిని గాయపడిందని తెలిపారు.
ఆ విద్యార్థిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించామని, స్వల్ప గాయాలైన సదరు విద్యార్థికి ప్రమాదమేమీ లేదని డాక్టర్లు వెల్లడించారని తెలిపారు. అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రి ముందు రహదారిపై వాహనాల రాకపోకల అంతరాయనికి యత్నించిన విద్యార్థులను పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.