కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎయిర్ పోర్టు సిద్ధమైంది. ఆదివారం నుంచి విమానరాకపోకలు ప్రారంభంకానున్నాయి. తొలుత విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు మాత్రమే ఇక్కడ నుంచి విమాన సర్వీసులు నడుపుతారు. తొలి దశలో పూర్తిగా స్వదేశీ సర్వీసులు మాత్రమే నడుపుతారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా ఇతర దూర ప్రాంతాలకు కూడా సర్వీసులు నడుపేలా ప్లాన్ చేశారు.
కర్నూలు - విశాఖ, కర్నూలు - బెంగళూరు మధ్య ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో విమానాలు నడుస్తాయి. కర్నూలు నుంచి ఉదయం 10.30 గంటలకు బయల్దేరే విమానం మధ్యాహ్నం 12.40కి విశాఖకు చేరుకుంటుంది. అనంతరం అదేరోజు మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయల్దేరి 2.55కి కర్నూలుకు చేరుకుంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 2 గంటల 10 నిమిషాలు.
ఇకపోతే, బెంగళూరు నుంచి ఉదయం 9.05కి బయల్దేరి 10.10కి కర్నూలు చేరుకుంటుంది. అదేరోజు తిరిగి 3.15 గంటలకు కర్నూలులో బయల్దేరి 4.25 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. కర్నూలు - బెంగుళూరుల మధ్య ప్రయాణ సమయం గంటా పది నిమిషాలు.
ఇక చెన్నై విమాన సర్వీసుల విషయానికి వస్తే... కర్నూలు - చెన్నై మధ్య మంగళ, గురు, శని, ఆదివారాల్లో సర్వీసులు ఉంటాయి. చెన్నై నుంచి మధ్యాహ్నం 2.50కి బయల్దేరి 4.10కి కర్నూలుకు చేరుకుంటుంది. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి చెన్నైకి 5.50కి చేరుకుంటుంది. చెన్నై - కర్నూలు మధ్య జర్నీ టైమ్ గంటా 20 నిమిషాలు.