విశాఖపట్నం వచ్చే పర్యాటకులు బీచ్‌ను తప్పనిసరిగా సందర్శిస్తారు. నగరవాసులు కూడా పండుగలు, సెలవు దినాల్లో కుటుంబంతో కలిసి బీచ్‌కు వెళ్లి సరదాగా గడుపుతుంటారు.
ఈ నేపథ్యంలో సముద్రంలో స్నానాలు చేసి పరవశించిపోతుంటారు. కోస్టల్ బ్యాటరీ నుంచి రుషికొండ వరకూ నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది.
భౌగోళికంగా ఈ ప్రాంతంలో బీచ్ లోతు కావడంతో స్నానాలు చేసేందుకు అనుకూలం కాదని జాతీయ సముద్ర విజ్ఞాన పరిశోధన సంస్థ (ఎన్‌ఐఓ) తేల్చిచెప్పింది.
అయినప్పటికీ సందర్శకులు ఈ ప్రాంతాల్లోనే స్నానాలకు ఉత్సాహం చూపిస్తుంటారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఏటా సగటున 50 మంది వరకు బీచ్‌లో దిగి మృత్యువాత పడుతున్నారు. వేసవి సమీపిస్తుండడంతో బీచ్‌కు సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరణాల నియంత్రణకు సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.