Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధానిగా విశాఖ రెడీ?

రాజధానిగా విశాఖ రెడీ?
, గురువారం, 14 జనవరి 2021 (22:04 IST)
పాలనా రాజదాని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సడీ సప్పుడు లేకుండా విశాఖకు పయనమవడానికి సన్నాహాలు చేస్తోంది. ఓ పక్క రాజధాని తరలింపు అంశం కోర్టులో నలుగుతుండగానే 'మరో నాలుగు నెలలు.. మే నాటికి విశాఖకు రాజధాని' అంటూ అధికార పార్టీ ప్రభుత్వం సంకేతాలిస్తూ.. అధికారులను సైతం అన్నీ సిద్ధం చేసుకోవాలిని ఆదేశించింది.

దీంతో పలు శాఖల అధికారులు తమ ప్రధాన కార్యాలయాల ఏర్పాటు పనుల్లో గుట్టుచప్పుడు కాకుండా నిమగమయ్యారు. ఇందుకోసం విశాఖ నగరంతోపాటు మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం తదితర ప్రాంతాల్లో భవనాలను పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే భీమిలి బీచ్‌రోడ్డులో గాయత్రి, గీతం విద్యా సంస్థల మధ్య గిరిజన మ్యూజియం కోసం భవన నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ భవనంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ఆనందపురం సమీపంలో ఓ పెద్ద భవనంలో ప్రైవేట్‌ పాఠశాల నడుస్తోంది.

అందులో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని, అ భవంతి కోసం కొన్ని శాఖల అధికారులు ఇప్పటికే ఆ భవన యజమానిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటి నుంచే ఆ భవనం ఖాళీ చేయాలని యజమానిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.
 
ఇటీవల విజయనగరం పర్యటనకు వచ్చిన సిఎం జగన్‌ తిరుగు ప్రయాణంలో విశాఖ కలెక్టర్‌ను విమానంలో తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాఖలో పాలనా రాజధానికి సంబంధించి భవనాల అన్వేషణ, కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు, ఇతర ఏర్పాట్లపై చర్చించినట్టు తెలిసింది. నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మంగళవారం చేసిన ప్రకటన ఇందుకు బలం చేకూరుస్తోంది.

ప్రస్తుతం మాధవధారలో కాలుష్య నియంత్రణ మండలి జోనల్‌ కార్యాలయం ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి ఎకరా స్థలం దీర్ఘకాలిక లీజు విధానంలో తీసుకుని భారీ భవనం నిరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క జల వనరుల శాఖ ఉత్తరాంధ్ర సిఇ కార్యాలయ ఆవరణలో కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటుచేసేందుకు చూస్తున్నారు.

ఇదే ప్రాంగణంలో నిర్మిస్తున్న మరో భవనాన్ని జల వనరుల శాఖ ప్రధాన కార్యాలయానికి కేటాయిస్తారని అధికారులు చెబుతున్నారు. అయితే రాజధాని తరలింపు అంశం కోర్టులో ఉన్నందున పార్టీ నేతలు గానీ, మంత్రులు గానీ, ప్రభుత్వాధికారులు గానీ ఎవరూ కార్యాలయాల కోసం భవనాల అన్వేషణ విషయాలను బహిరంగంగా ఎవరూ వెల్లడించడం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 179 కరోనా కేసులు