ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా జరువుతున్న ఫిట్ ఇండియా రన్ శనివారం ఉదయం శ్రీకాకుళంలో నిర్వహించారు. నెహ్రు యువక కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రన్ ను విశ్రాంత జాయింట్ కలెక్టర్ పి.రజనీ కాంతారావు జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా ఆగస్ట్ 13 న ప్రారంభమైన ఈ రన్ అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు సాగుతుందని, అన్ని జిల్లాల్లో ఈ రన్ నిర్వహిస్తారని అన్నారు.
దృఢమైన భారత్ స్థాపన ప్రధానమంత్రి లక్ష్యమని, ఈ దిశగా అందరూ అడుగులు వేసి ప్రతి నిత్యం వ్యాయామాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అరసవల్లి జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు 5 కిలోమీటర్లు ఈ రన్ సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నెహ్రూ యువక కేంద్రం కో ఆర్డినేటర్ మహేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి బి.శ్రీనివాస్ కుమార్, పలువురు జిల్లా అధికారులు, ఎన్. సి.సి.విద్యార్థులు, వాకర్స్ వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.