Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రముఖ ఆధ్యాత్మిక సలహాదారు భారతుల వెంకటేశ్వర్లు కన్నుమూత

ప్రముఖ ఆధ్యాత్మిక సలహాదారు భారతుల వెంకటేశ్వర్లు కన్నుమూత
, గురువారం, 29 ఆగస్టు 2019 (08:32 IST)
ప్రముఖ ఆధ్యాత్మిక సలహాదారు, రిటైర్డ్ ఎమ్మార్వో భారతుల వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి 11:40 గంటలకి స్థానిక సెంటిని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసారు. గత కొంతకాలంగా ఆయన స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయసు సుమారు 78 సంవత్సరాలు.

ఆయనకు భార్య శీలవతి, కుమారులు శ్రీధర్, విజయ్ కిరణ్ లు, కుమార్తెలు సౌజన్య, అరుణ ఉన్నారు. జనవరి 1వ తేదీ, 1941 న ప్రకాశం జిల్లాలోని దర్శి తాలూకా వెంకటచలం పల్లిలో సీతమ్మ, వెంకట సుబ్బయ్యలకు నాల్గవ కుమారునిగా వెంకటేశ్వర్లు జన్మించారు.

8వ సంవత్సరం వరకు అదే గ్రామంలో ఉండి 9వ సంవత్సరంలో మేనమామ గారైన వెల్లంకి సీతారామశాస్త్రి గారి ఇంట్లో ఉండి పియుసి వరకు చదివారు. పి యు సి పూర్తి అయిన తర్వాత దర్శి వెళ్లి మండల ఆఫీసులో టైపిస్ట్ గా జాయిన్ అయ్యారు. ఏపీపీఎస్సీలో సెలక్షన్ పొంది రెవెన్యూ విభాగంలో తాలూకా ఆఫీసులో గుమస్తాగా చేరారు.

తరువాత ఆర్ఐ గాను, విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గాను, విజయవాడ అర్బన్ ఎమ్మార్వో గాను సేవలందించారు. సుదీర్ఘకాలం రెవెన్యూలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వెంకటేశ్వర్లు తన ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో మానవీయ కోణాన్ని మిళితం చేసుకొని పని చేశారు.

వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రజలతో సహృదయంతో వ్యవహరిస్తూ వారి మన్ననలను అందుకున్నారు. అందువల్లే రెవెన్యూ విభాగంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉండేది. కృష్ణా జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ఏవీఎస్ రెడ్డి, లక్ష్మీ పార్థసారథి భాస్కర్, రాజీవ్ భట్టాచార్య, తదితర ఐఏఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి వారి ప్రశంసలు పొందారు.

తన ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చుకుంటూనే ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో, ధార్మిక సంస్థలలో తన సేవలను అందించారు. అనేక ధార్మిక సంస్థల యందు అత్యున్నతమైన పదవులను చేపట్టి విశిష్ట సేవలు అందించారు.

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పక్కన ఉన్న త్రిశక్తి పీఠానికి ఆధ్యాత్మిక సలహాదారుతో పాటు కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. చిన్మయ మిషన్ కి కోశాధికారిగా, శాతవాహన కళాశాలకు జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.

జీర్ణమైన  దేవాలయాల పునరుద్ధరణ. నూతన దేవాలయాల నిర్మాణాలు వంటి కార్యక్రమాలను చేస్తూ శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరి పీఠంకు ప్రాంతీయ కార్యదర్శిగా సేవలను అందించారు. బుధవారం సాయంత్రం స్వర్గపురి లో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మో... లోకేష్ ఎంత మాటన్నారు?!.. వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు