ఒక్కోసారి ఒక్కొక్కరి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతుంటాయి. సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఒడిదుడుకులు మామూలే. కానీ లేవలేని ఎదురుదెబ్బ తగిలితే మాత్రం తేరుకోవడం కష్టమే. అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఓ యువకుడు. గాఢంగా ప్రేమించిన ప్రియురాలు దొంగ అని తెలుసుకుని నివ్వెరపోయాడు.
వైజాగ్‌కు చెందిన నవీన్ డిగ్రీ చదువుతున్నాడు. తన ఇంటికి దగ్గరలోనే ఉన్న కమల అనే యువతిని ప్రేమించాడు. రెండు సంవత్సరాలుగా వీరి మధ్య ప్రేమాయణం సాగింది. అయితే కమల ఆర్థిక పరిస్థితి సరిగా లేదని తెలుసుకున్న నవీన్ అప్పుడప్పుడు డబ్బులు సహాయం చేసేవాడు. కమల తన అక్క శ్యామల ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఉండేది. శ్యామల భర్త తాగుబోతు.
ఇంటి గురించి అస్సలు పట్టించుకోకపోవడంతో శ్యామల కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడుతూ ఉండేది. దీంతో నవీన్ ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ వచ్చాడు. తన ఇంటిలో డబ్బులు బలవంతంగా తీసుకోవడం.. బంగారం నగలను కుదవపెట్టి వారికి ఇవ్వడం చేసేవాడు. నవీన్ కుటుంబ సభ్యులకు తాను ఒకమ్మాయిని ప్రేమిస్తున్నాడని, వారికి సహాయం చేస్తున్నారన్న విషయం తెలుసు. దీంతో వారు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు.
ఇంటి అద్దె సరిగ్గా కట్టకపోవడంతో తనకు తెలిసిన వారి ఇంటిలోనే శ్యామల, కమలకు ఇంటిని అద్దెకు తీసిచ్చాడు. తానే ప్రతినెలా అద్దెను కూడా చెల్లించేవాడు. గత నాలురోజుల క్రితం ఇంటి ఓనర్‌ను శ్యామల, కమల ఇద్దరూ తాళ్ళతో కట్టి బంగారం దొంగతనం చేశారు. శ్యామల బంగారు నగలను తీసుకొని వెళ్ళిపోగా కమల దొరికిపోయింది. వెంటనే కమల నవీన్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది.
హడివిడిగా కమల దగ్గరకు వెళ్ళి నవీన్ తన ప్రియురాలు, ఆమె అక్క కలిసి దొంగతనానికి పాల్పడ్డారని తెలిసి ఆశ్చర్యపోయాడు. నవీన్ కూడా దొంగతనంలో భాగస్వామ్యుడే అని అనుమానించిన పోలీసులు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఏ పాపం తెలియని నవీన్ ప్రియురాలు చేసిన పనికి తల వంచుకుని కూర్చునిపోయాడు. పోలీసులు విచారణలో శ్యామల, కమలలు పాత నేరస్తులని, గతంలో కూడా దొంగతనాలకు పాల్పడేవారిని గుర్తించారు. దీంతో నవీన్ నివ్వెరపోయాడు. విషయం కాస్త నవీన్ తండ్రికి తెలిసి బెయిల్ పైన అతడిని విడిపించాడు. కమల చేసిన నిర్వాకానికి నవీన్ తల దించుకున్నాడు.