ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కావలిలో దారుణం చోటుచేసుకున్నది. వొదినపై కోర్కె పెంచుకున్న ఓ మరిది ఆమె అందుకు నిరాకరించడంతో దారుణంగా హతమార్చి ఆమె శవంపై అత్యాచారం చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బిస్వాస్ అనే వ్యక్తి తన భార్య అర్పిత, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో పాటు కావలిలో వుంటున్నాడు. ఇక్కడ మొలలు చికిత్స కేంద్రాన్ని పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఐతే వీరితో పాటు శ్రీకాంత్‌కి తమ్ముడు వరసయ్యే నయా బిస్వాస్ కూడా వుంటున్నాడు. ఇతడు తన అన్న భార్య అర్పితపై కన్నేసాడు. ఈ క్రమంలో నూతన సంవత్సర వేడుకలను ఇంటిల్లిపాది జరుపుకున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు తిరుమలకు వెళ్లారు. శ్రీకాంత్ పూటుగా మద్యం సేవించి నిద్రపోతున్నాడు.
ఇదే అదనుగా నయా బిస్వాస్ అర్థరాత్రి వేళ వొదిన పడుకున్న గదికి వెళ్లాడు. తన కోర్కె తీర్చాలంటూ ఆమెపై అత్యాచార యత్నం చేసాడు. అందుకామె ప్రతిఘటించడంతో ఇనుప రాడ్డుతో తలపై మోదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఐనా ఆమె శవంపై అత్యాచారం చేసి కోర్కె తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని సమీపంలోని పంట కాలువలో పడేసి వచ్చాడు.
ఉదయాన్నే నిద్ర లేచిన శ్రీకాంత్ తన భార్య కోసం వెతకగా ఇంట్లో మంచంపై రక్తపు మరకలు కనిపించాయి. దీనితో తీవ్ర ఆందోళనకు గురైన శ్రీకాంత్ పొరుగున వున్నవారికి సమాచారమిచ్చాడు. ఐతే గతంలో కూడా వొదినపై అఘాయిత్యం చేసేందుకు నయా బిస్వాస్ ప్రయత్నించిన ఘటన జరగడంతో అంతా అతడిని నిలదీసి దేహశుద్ధి చేసారు. దీనితో జరిగినదంతా చెప్పాడు. పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.