మధ్యాహ్న భోజన పథకం వికటించింది. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్నవారిలో కొందరు విద్యార్థులు వెంటనే వాంతులు చేసుకున్నారు.
దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఉడకని భోజనం తినడమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో.. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు.
పిల్లలు అస్వస్థతకు గురికావడానికి కారణమైన హెచ్‌ఎం లక్ష్మీనరసింహులును డీఈవో సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీపై విచారణకు ఆదేశించారు.