Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో గిరిజన కుటుంబాలకు 25.16 లక్షల దోమతెరలు

ఏపీలో గిరిజన కుటుంబాలకు 25.16 లక్షల దోమతెరలు
, ఆదివారం, 22 నవంబరు 2020 (18:43 IST)
గిరిజనులను సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడానికే దోమతెరలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. రాష్ట్రంలోని 7 ఐటీడీఏల పరిధిలో 25.16 లక్షల గిరిజన కుటుంబాలకు దోమ తెరలను అందిస్తున్నామని వెల్లడించారు.

గిరిజనుల్లో దోమతెరల వినియోగంపై అధికారులు అవగాహన పెంచి చైతన్యం కలిగించే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ తరుణంలో గిరిజనులను వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి దోమ తెరలను పంపిణీ చేస్తున్నామని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పుష్ప శ్రీవాణి తెలిపారు.

గాలిలో తేమ అధికంగా ఉండే వానాకాలం, శీతాకాలాల్లో పెరిగే దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి ప్రాణాంతకమైన సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధుల బారినపడి అనేక మంది గిరిజనులు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంటుందన్నారు. ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడానికి దోమతెరలు ఉపయోగపడతాయని చెప్పారు.

దోమతెరలను ఉపయోగించడం వల్ల దోమల కాటు నుంచి కాపాడుకోచ్చునని, దాంతో వ్యాధుల బారినపడే అవకాశం గణనియంగా తగ్గుతుందని  వివరించారు. అయితే ప్రతి ఏటా గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేస్తున్నా కొంతమందికి వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో వాడకుండా బీరువాల్లో  పెట్టుకుంటున్నారని, ఈ కారణంగానే అనేక కుటుంబాలు వ్యాధుల బారిన పడటం గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల జరుగుతోందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు ఐటీడీఏ జిల్లాల పిధిలో పరిధిలో ఉన్న 25  లక్షల 16 వేల గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్న‌ట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 4 లక్షల 6 వేల 200 కుటుంబాలకు, విజయనగరం జిల్లాలో 5 లక్షల 21 వేల 400 కుటుంబాలకు, విశాఖపట్నం జిల్లాలో 7 లక్షల 69 వేల 650 కుటుంబాలకు, తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల 93 వేల 350 కుటుంబాలకు దోమ తెరలను అందించనున్నామని చెప్పారు.

అలాగే పశ్చిమ గోదావరి  జిల్లాలో 2 లక్షల 52 వేల 445 కుటుంబాలకు, నెల్లూరు జిల్లాలో జిల్లాలో 57 వేల 900 కుటుంబాలకు, కర్నూలు జిల్లాలో 15 వేల 100 కుటుంబాలకు కూడా దోమ తెరలను పంపిణీ చేస్తున్నట్లు పుష్ప శ్రీవాణి వెల్లడించారు.

గిరిజనుల్లో దోమతెరల వినియోగంపై అవగాహన లేకపోవడంతో పాటుగా దోమల మందు    విషయంలోనూ అపోహలు ఉన్నాయని, ఈ కారణంగా కొన్ని చోట్ల దోమల నివారణకు ఉపయోగించే మందులను  స్ప్రే చేయడాన్ని కూడా అడ్డుకుంటున్నారని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. 

ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దోమతెరల  వినియోగం, దోమల మందు పిచికారీ విషయంలో గిరిజనుల్లో అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకొచ్చే  విధంగా వినూత్నమైన రీతిలో కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గిరిజన కుటుంబాలు తమకు అందించిన  దోమతెరలను బీరువాలో దాచిపెట్టకుండా, సద్వినియోగం చేసుకోవాలని తద్వారా సీజనల్ వ్యాధుల బారి నుంచి తమను తాము కాపాడుకోవాలని పుష్ప శ్రీవాణి విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్పొరేట్ల‌కు తాయిలాలు...‌ ఉద్యోగులకు కోత‌లా?: ఆలిండియా బిఎస్ ఎన్ ఎల్ పింఛ‌నుదారుల సంక్షేమ‌ సంఘం