ఉత్తరప్రదేశ్ నుండి కడపకు చేరుకున్న134 మంది విద్యార్థులు

మంగళవారం, 19 మే 2020 (21:29 IST)
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా చొరవతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ జిల్లాలో ఉన్న 134 మంది ఆంధ్రప్రదేశ్ వాసులు మంగళవారం కడప జిల్లాకు చేరుకున్నారు.

రాష్ట్రానికి చెందిన 134 మంది ముస్లిం మైనారిటీ పిహెచ్‌డి విద్యార్థులు ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ లోని మదరసాలో ఉంటూ లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. 
 
దాదాపు 50 రోజులపాటు అక్కడే ఉంటూ నానా ఇబ్బందులు పడుతూ... చివరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా సెల్ నెంబర్ కు కడప జిల్లాకు చెందిన నూర్ అనే విద్యార్థి ఈ నెల 15వ తేదీన ఫోన్ చేసి వారి అవస్థలు విన్నవించుకున్నారు. దీంతో స్పందించిన రాష్ట్ర మైనారిటీ శాఖామంత్రి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా... రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డీతో మాట్లాడారు.

ప్రత్యేక చొరవతో.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో.. మాట్లాడి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి.. 17వ తేదీ రాత్రి 5 బస్సులలో 134 మందిని రాష్ట్రానికి రప్పించారు. మంగళవారం నాడు... కడప నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ లో వారు బస్సుల నుండి దిగి సొంత గడ్డపై కాలు పెట్టి కన్నీరు పెట్టుకున్నారు. తమ కష్టాలను గుర్తించి, సరైన సమయంలో స్పందించిన జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషాకు, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తర ప్రదేశ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన 5  బస్సులలో..  కడప (30), అనంతపురం (16), చిత్తూరు (25), విజయవాడ(30), కర్నూల్ (34) కు చెందిన వారు ఉన్నారు. కాగా మంగళవారం ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన 30 మంది జిల్లా వాసులకు స్వాగతం పలికారు.

వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని, వారి ప్రయాణ విధానాన్ని తెలుసుకున్నారు. వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం జిల్లాకు సురక్షితంగా చేరినందులకు ఆ అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ప్రార్థనలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డీ ప్రభుత్వం.. కరోనా వైరస్ వల్ల ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో చిక్కుకుపోయిన వారిని, వలస కార్మికులను వారివారి సొంత ఊళ్లకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

ఈ క్రమంలో వైరస్ వ్యాధి నిర్ధారణ కోసం.. పులివెందుల రోడ్డు వైయస్సార్ సర్కిల్లో దిగిన వారిని అక్కడి నుంచి.. యోగి వేమన యూనివర్సిటీ లోని క్వారంటైన్ కు పంపడం జరిగింది. అలాగే ఉత్తర ప్రదేశ్ నుండి జిల్లాకు వచ్చిన 30 మందితో పాటు.. ఇతర జిల్లాలకు చెందిన వారిని ఆయా జిల్లాలకు చేర్చి, అక్కడ క్వరంటైన్ కేంద్రాలకు పంపడం జరిగింది.

వీరిని 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉంచిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి వీరికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవని తేలిన తర్వాత వారిని వారి ఇళ్లకు పంపడం జరుగుతుంది. కార్యక్రమంలో తాసిల్దార్ శివరామిరెడ్డి, 44వ డివిజన్ ఇంచార్జి బంగారు నాగయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రేపు మోదీ కేబినెట్ కీలక భేటీ!