Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.12 వేల కోట్లతో కడపలో మరో ఉక్కు కర్మాగారం

రూ.12 వేల కోట్లతో కడపలో మరో ఉక్కు కర్మాగారం
, శుక్రవారం, 6 మార్చి 2020 (07:29 IST)
కడపలో మరో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు 12 వేల కోట్లతో స్విస్ కంపెనీ ఐఎంఆర్ ​ఏజీ ముందుకొచ్చింది. ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్​తో చర్చలు జరిపారు.

ప్రభుత్వం నుంచి ఏ సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వైయస్సార్‌ కడప జిల్లాలో మరో భారీ స్టీల్‌ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

కంపెనీ ప్రతినిధులు గురువారం సీఎం వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి ఎదుట వైయస్సార్‌ కడప జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఈ ప్లాంట్‌ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.

ఈ సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని విడిది కార్యాలయంలో ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఆర్‌ కంపెనీ కార్యకలాపాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను పెట్ట‌బోతున్న‌ట్లు వారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వివరించారు.

వైయస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామంటూ వారికి వివరించారు. ఐఎంఆర్‌ కూడా మరొక స్టీల్‌ప్లాంట్‌ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు.

నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు,  అక్కడ నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని సీఎం వారికి వివరించారు.

పరిశ్రమల రాకవల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. రానున్నరోజుల్లో వైయస్సార్‌ కడప జిల్లా ప్రాంతం స్టీల్‌సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

సమావేశంలో చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, ఇండస్ట్రీస్‌ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్, ఐఎంఆర్‌ ఏజీ ఛైర్మన్‌ హాన్స్‌ రడాల్ఫ్‌ వైల్డ్, కంపెనీ డైరెక్టర్‌ అనిరుద్‌ మిశ్రా, సెడిబెంగ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీ సీఈఓ అనీష్‌ మిశ్రా, గ్రూప్‌ సీఎఫ్‌ఓ కార్ల్‌ డిల్నెర్, టెక్నికల్‌ డైరెక్టర్‌ సురేష్‌ తవానీ, ప్రాజెక్ట్స్‌ ప్రెసిడెంట్‌ అరిందమ్‌ దే, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ సంజయ్‌సిన్హా, ఏపీ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్స్‌ ఎండీ పి.మధుసూదన్‌ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 69.54 శాతం పూర్తి: తేల్చి చెప్పిన కేంద్రం