Publish Date: Thu, 27 May 2021 (12:52 IST)
Updated Date: Thu, 27 May 2021 (12:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. కరోనా సమయంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేసినా… ఏపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతుందని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పరీక్షలు నిర్వహించటం లేదని, పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి ఇప్పటికి ఇప్పుడు స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
టీచర్లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి టీకాలు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షలపై ప్రభుత్వం మళ్లీ జూలైలో సమీక్ష చేసి, తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఏ పరీక్షలను నిర్వహించి తీరుతామని పదేపదే చెబుతూ వచ్చిన ఏపీ విద్యా శాఖ.. హైకోర్టుకు మాత్రం ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలపడం గమనార్హం. అలాగే, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.