కరోనా సమయంలోనూ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా మరో మూడు పథకాలను శ్రీకారం చుట్టనుంది. జూన్‌లో అమలు కానున్న పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. జూన్ 8న జగనన్న తోడు పథకం, జూన్ 15న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం, జూన్ 22న వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తామని సీఎం తెలిపారు.
గ్రామ సచివాలయాల్లో జాబితాలను డిస్‌ప్లే చేసి.. సోషల్ ఆడిట్ తర్వాత మార్పులు, చేర్పులు చేయాలన్నారు. జూన్ 31న పశ్చిమగోదావరి జిల్లాలో అమూల్-ఏపీ పాల ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
జులై 8న దివంగత సీఎం వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్బీకేలు ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. కొత్తగా నిర్మాణం చేపట్టనున్న మెడికల్ కాలేజీలకు 30న శంకుస్థాపన చేస్తామన్నారు. వచ్చే ఉగాది నాటికి పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ప్లాట్లు అందిస్తామన్నారు. దాదాపు 17 వేల ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
రకరకాల కేటగిరిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణ జరుగుతుందన్నారు. దాదాపు 3 లక్షల మందికి ప్లాట్లు అందిస్తామన్నారు. వివాదాల్లేని ప్లాట్లు రిజిస్ట్రేషన్, లాభాపేక్ష లేకుండా అర్హులకు ప్లాట్లు పంపిణీ చేస్తామన్నారు. లే అవుట్‌ను కూడా అభివృద్ధి చేస్తామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణాంతకం అని తెలిసినా రోగులకు సేవలు అందిస్తున్నారని వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. ఎలాంటి సహాయ, సహకారం కావాలన్నా అందించేందుకు సిద్దమని ప్రకటించారు. అనంతరం కలెక్టర్లతో జరిగిన సమావేశంలో వైఎస్సార్ జలకళ, ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల ప్రగతిని సీఎం జగన్ తెలుసుకున్నారు.
రాష్ట్రంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని సీఎం ఆధేశించారు. ఇది మహమ్మారి సమయం, ప్రతి పేదవాడికి సేవలు చేయాల్సిన సమయం అని అన్నారు. 104 కాల్ సెంటర్ వన్ స్టాప్ సొల్యూషన్‌గా పెట్టామని, మన బంధువులే మనకు ఫోన్ చేస్తే ఎలా స్పందిస్తామో.. 104కు ఎవరైనా ఫోన్ చేస్తే అలాగే స్పందించాలన్నారు. జర్మన్ హేంగర్లపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలన్నారు.