కొందరు పోలీసుల వ్యవహారశైలి శృతి మించుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసులు, వైసీపీ నేతలతో కుమ్మక్కై టీడీపీ నేతలను అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేశారన్న కారణంతో, టీడీపీ కార్యకర్త అంజిపై అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు.
కండ్రికలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే, దాడి చేసినవారిని వదిలేసి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయన్నారు. తప్పుడు కేసులకు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వైసీపీ పాలనలో పోలీసుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.