రికార్డులు తిరగరాసిన వైకాపా.. టీడీపీకి అతి దారుణమైన ఓటమి...

శుక్రవారం, 24 మే 2019 (08:51 IST)
తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ చరిత్రలోనే అతి దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. అదేసమయంలో వైకాపా పాత రికార్డులను తిరగరాసింది. గురువారం వెల్లడైన ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైకాపా ఏకంగా 150 సీట్లలో విజయం సాంధించిచన విషయం తెల్సిందే. 
 
ఉత్కంఠభరితంగా సాగిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో పాత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ వైసీపీ అత్యంత భారీ విజయం సాధించింది. జిల్లాలకు జిల్లాల్ని ఏకపక్షంగా తన ఖాతాలో వేసుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం ఊహించని స్థాయిలో 50 శాతం ఓట్లతో 151 సీట్ల మార్కును చేరుకుంది.
 
గత 2009లో వైఎస్‌.రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో 294 సీట్లకు కాంగ్రెస్‌ 156 సాధించగా... ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కేవలం 175 సీట్లలోనే వైసీపీ దాదాపు ఆ స్థాయిలో బలం సాధించి రికార్డు సృష్టించింది. మొత్తం సీట్లలో ఏడింట ఆరువంతుల సంఖ్యను సాధించింది. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ సృష్టించిన రికార్డును తిరగరాసింది. 
 
2004లో ఉమ్మడి ఏపీలో 47 సీట్లు మాత్రమే గెల్చి ఘోర పరాజయం చవిచూసిన టీడీపీ ఇప్పుడు నవ్యాంధ్రలో కేవలం 23 సీట్లు మాత్రమే దక్కించుకుని అంతకంటే దారుణమైన (దామాషా ప్రకారం) ఓటమి పాలైంది.
 
ముఖ్యంగా, నెల్లూరు, కడప, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తమను బాగా ఆదుకుంటాయని భావించిన కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీకి రెండేసి సీట్లు మాత్రమే దక్కడం టీడీపీ శ్రేణులను హతాశులను చేసింది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. 
 
ఇక ఎన్నికలకు ముందు వైకాపా నుంచి టీడీపీలోకి వెళ్లిన ఫిరాయింపుదారులకు తిరస్కారమే ఎదురైంది. వైసీపీ నుంచి టీడీపీలోకి మారి పోటీ చేసిన వారిలో ఒక్క గొట్టిపాటి రవికుమార్‌ మాత్రమే గెలిచారు. మిగిలినవారంతా చిత్తుగా ఓడిపోయారు. 
 
అయితే, టీడీపీ నుంచి వైసీపీలో చేరి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్‌, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలిచేశారు. అంతా ఊహించినట్లుగానే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్రంలో ఖాతా కూడా తెరవలేక చతికిలబడ్డాయి. దేశంలో అసలు జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యమే లేని శాసనసభలుగా ఆంధ్రప్రదేశ్‌, సిక్కింలు అవతరించాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మోడీ ఓట్ల సునామీ : ముగ్గురు కేంద్ర మంత్రుల ఓటమి