ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన పోలింగ్‌లో తప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఉన్న ఓట్ల కంటే పోలింగైన ఓట్లు ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దీనిపై సిబ్బందిని అడిగితే వారు అనేక కారణాలను చెబుతున్నారు.
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ పోలింగ్ జరిగినట్లు చూపడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ 5 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదైనట్లుగా చెబుతున్నారు. సంతమాగులూరు మండలం 48వ పోలింగ్ కేంద్రంలో 299 మహిళా ఓటర్లు ఉండగా 350 ఓట్లు పోలైనట్లు చూపించటం విశేషం.
అద్దంకి పట్టణంలోని 154వ పోలింగ్ కేంద్రంలో 435 మంది పురుష ఓటర్లు ఉండగా 500 ఓట్లు పోలైనట్లు చూపించారు. మొత్తం పోలింగ్ శాతం 89.87గా చూపించినా లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి. ఎందుకిలా జరిగిందని ప్రశ్నిస్తే, అధికారుల నుంచి వస్తున్న సమాధానం వింటే మతిపోవాల్సిందే.
ఎన్నికల రోజున హడావుడిగా ఉండటంతో కంప్యూటర్లో తప్పుగా నమోదైందని చెప్పటం విశేషం. ఎంట్రీలో మాత్రమే పొరపాటు జరిగిందని, దాన్ని సరిచేసి పంపుతామని చెబుతున్నారు. వీరి తీరు చూస్తుంటే పోలింగ్ జరిగిన విధానంపైనా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.