Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతి శ్రీనివాస సేతుపై యువత పిచ్చిచేష్టలు... పిల్లిమొగ్గలు

తిరుపతి శ్రీనివాస సేతుపై యువత పిచ్చిచేష్టలు... పిల్లిమొగ్గలు
, గురువారం, 10 మార్చి 2022 (18:07 IST)
నూతనంగా నిర్మించిన ప్రతిష్టాత్మక తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ సర్కస్ ఫీట్లకు వేదికగా మారుతోంది, కొంతమంది యువత వింత చేష్టలతో ప్రమాదకరంగా తయారవుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

 
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో రద్దీని నియంత్రించడమే లక్ష్యంగా భక్తులు సులభంగా తిరుమలకు ప్రయాణించే లక్ష్యంతో 600 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీనివాస సేతు రూపుదిద్దుకుంది. నిర్మాణం మొదటి దశ పనులు పూర్తి కావడంతో ఆర్టీసీ బస్టాండ్ నుంచి కపిలతీర్థం వరకు ఉన్న ఫ్లైఓవర్‌ను ఈ మధ్యనే ప్రారంభించారు. 

 
ఫ్లైఓవర్ అసలు లక్ష్యం అలా ఉంచితే వింత వింత పోకడలకు, సర్కస్ ఫీట్లకు శ్రీనివాస సేతు వేదికగా మారుతుందన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత సాయంత్రమైతే చాలు పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ పైకి చేరుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు అక్కడే తిష్టవేస్తున్నారు. అతి వేగంగా వాహనాలు నడిపే వాళ్ళు కొందరైతే మరికొందరు సర్కస్ ఫీట్లతో రెచ్చి పోతున్నారు.

 
ఇక సెల్ఫీ మోజులో రోడ్డుకు అడ్డంగా వింతవింత భంగిమలతో మరికొందరు దర్శనమిస్తున్నారు. ఇలా యువత చేస్తున్న పిచ్చి చేష్టలు ప్రమాదకరంగా మారుతున్నాయి. నిత్యం వందలాదిగా ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలు తిరుమలకు వెళుతూ ఉంటాయి. ట్రాఫిక్ పెద్దగా ఉండదన్న కారణంతో వేగంగా వాహనాలు వెళుతుంటాయి. అయితే ఈ వాహనాలకు అడ్డంగా యువత చేస్తున్న చేస్తున్న చేష్టలు వారికే కాకుండా ఇతరులకు ప్రాణాంతకంగా మారుతోంది.

 
యువ జంటలు ఫ్లైఓవర్ పైన బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. మరికొందరు కూడా సెల్ఫీలు తీసుకుంటూ వాహనాలు వస్తున్నాయన్న సంగతి మరిచిపోయి తమ లోకంలో మునిగితేలుతున్నారు. ఇక పిచ్చికి పరాకాష్ట గా చేరిన కనిపిస్తున్న ఫోటో చూడండి. ఇద్దరు యువకులు ఏకంగా నడిరోడ్డు మీద పడుకొని మరీ వింతవింత భంగిమలతో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు.

 
ఓవైపు భారీ వాహనాలు వేగంగా వెళుతున్న సమయంలోనే రోడ్డు మీద అడ్డంగా పడుకొని దొర్లుతున్నారు. ఒకవేళ వేగంగా వెళ్తున్న వాహనదారులు గమనించుకోకుండా వారిని ఢీకొంటే పరిస్థితి ఏమవుతుంది. వారితో పాటు వాహనాల్లో వెళ్తున్న వారికి ప్రమాదకరంగా మారుతుంది. ఇంత జరుగుతున్నా అక్కడే గస్తీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యాకు షాక్: యూట్యూబ్‌, గూగుల్ ప్లే సేవలు బంద్