ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధికారంలో ఉంది. ఈ పార్టీకి చెందిన కొందరు నేతలు తమ పార్టీ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి శంకర నారాయణ ఒకరు. ఈయన మంత్రిగా ఉన్నపుడు పెనుకొండ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలనే ముప్పతిప్పలు పెట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు పండగ చేసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో జరిగింది. ఇది అధికార పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. పెనుకొండ వైకాపాలో అమ్మోరికి అసమ్మతి నేతలు పొట్టేలు సమర్పించి మరీ పండగ చేసుకున్నారు. అంటే అసమ్మతి నేతలు మొక్కు చెల్లించుకున్నారు. శంకర నారాయణకు మంత్రి పదవి ఊడినందుకు స్థానికంగా ఉండే సుంకులమ్మకు గొర్రె పొట్టేలును బలిచ్చి మొక్కు తీర్చుకున్నారు.
ఈ మొక్కు తీర్చుకున్నవారిలో పెనుకొండ వైకాపా అసమ్మతి నేతలు గంపల రమణారెడ్డి, కర్రా సంజీవ రెడ్డి, దిలీప్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరు పేరుతో సోషల్ మీడియాలో విందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. విందు కోసం తెప్పించిన పొట్టేళ్ళను సోషల్ మీడియాలో వైకాపా అసమ్మతి నేతలు పోస్ట్ చేయడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.