డబ్బు సంపాదన కోసమే జగన్ వైన్ షాపులు తెరిచారని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.
మద్యం అమ్మకాలను నిషేధించడంతో 40 రోజుల పాటు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని మద్యం బ్రాండ్‌లను అమ్ముతున్నారని అన్నారు. నాసిరకం బ్రాండ్లంటే.. విషం అమ్ముతున్నట్లేనని వ్యాఖ్యానించారు.
మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులే.. క్యూలైన్లలో ప్రజలను అదుపు చేసే విధుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ డబ్బులు.. నాన్న గొంతుతడి చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులను ఘోరంగా పెంచిందని అయ్యన్న ఆరోపించారు. ఏపీలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతుంటే లాక్‌డౌన్‌ను సడలించడం సరికాదన్నారు.