Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామాంధుల కర్కశానికి ప్రియాంకా బలైపోయింది : విజయశాంతి

Advertiesment
కామాంధుల కర్కశానికి ప్రియాంకా బలైపోయింది : విజయశాంతి
, శనివారం, 30 నవంబరు 2019 (10:15 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అత్యాచార ఘటనపై దేశంలోని పలువురు సెలెబ్రిటీలు స్పందించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. 
 
ఈ నేపథ్యంలో సినీ నటి విజయశాంతి ఈ ఘటనపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆమె ఈ ఘటనపై ఓ పోస్ట్ చేశారు. మదమెక్కిన మగ పిశాచాల దాష్టీకానికి మాతృ హృదయం తల్లడిల్లిపోతోందన్నారు. ఇది సభ్య సమాజానికే తీరని కళంకమన్నారు. కామాంధుల కర్కశానికి ఓ వైద్యురాలు బలైపోయిందన్నారు. తెలంగాణ సమాజానికి ఇది తీరని అవమానమని విజయశాంతి అన్నారు.
 
అలాగే, ఒక్క హైదరాబాద్, ఒక్క వరంగల్‌లో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు. సమిధలుగా మారుతున్నది ప్రియాంక, మానసలే కాదని, గొప్పగా చెప్పుకునే మానవత్వం కూడానని ఆవేదన చెందారు. 
 
ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేల్కొనకపోతే మహిళా ఉద్యమం తథ్యమని హెచ్చరించారు. విశ్వ నగరంలో అతివకు రక్షణ కరువైందన్నారు. షీ టీంలు, మహిళా భద్రత ఎండమావిగా మారాయన్నారు. అర్థరాత్రి అతివ స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలని ఆకాంక్షించారు.
 
ఇలాంటి ఘాతుకాలకు తెగబడే ముందు అమ్మల కడుపున పుడుతున్న అన్నదమ్ములు ఒక్క క్షణం ఆలోచించాలని విజయశాంతి కోరారు. కని, పెంచిన అమ్మ, తోడబుట్టిన అక్కచెల్లెళ్లు, కడుపున పుట్టిన ఆడబిడ్డలు ఎందుకు గుర్తుకు రావడం లేదని విజయశాంతి ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అచ్చెన్నాయుడు జస్ట్ ఎస్కేప్.... ఊపిరి పీల్చుకున్న టీడీపీ శ్రేణులు