టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న కళాశాలలు, పాఠశాలలను నవంబరు 2వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) సదా భార్గవి తెలిపారు.
టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం జెఈవో టిటిడి కళాశాలల ప్రిన్సిపాల్స్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడి విద్యా సంస్థలలో మెరుగైన శానిటైజెషన్ (పారిశుద్ధ్య) ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
టిటిడి కళాశాలలో 2020 - 21 విద్యా సంవత్సరంలో నిర్ధేశించిన సీట్లలలో మాత్రమే విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలన్నారు.
తరగతి గదులలో 16 నుండి 30 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని, విద్యార్ధుల మధ్య భౌతిక దూరం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, క్లాస్ రూమ్‌లను ఎప్పటి కప్పుడు శానిటైజ్ చేయాలన్నారు.
విద్యాసంస్థల ప్రాంగణంలో శానిటైజర్లు, సోపులు ఉంచాలని, అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు.
ప్రతి కళాశాలకు రెండు కోవిడ్ ప్రథమ చికిత్స కిట్లు అందించాలని వైద్య ఆధికారులను ఆదేశించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కోవిడ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం కళాశాలల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో డిఇవో రమణ ప్రసాద్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్, టిటిడి కళాశాలల ప్రిన్సిపాల్స్ , పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గోన్నారు.