దేశంలోనే జగన్ అరుదైన రాజనీతిజ్ఞుడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం విలేఖరులతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..
1. ఒక రాష్ట్ర చరిత్రలో గానీ, ప్రజా జీవితంలోగాని, వ్యవస్థలకు సంబంధించిగానీ, రాజకీయ సమీకరణల్లో గానీ ఏరకంగా చూసినా.. ఎక్కడా, ఎప్పుడూ జరగని ఒక పెద్ద మార్పు ఆంధ్రప్రదేశ్ లో గడిచిన మూడేళ్ళ కాలంలో జరిగింది. ఒక కుటుంబంలో చూసుకున్నా రెండు, మూడేళ్ళలో పెద్దగా మార్పు కనిపించదు.
అలాంటిది దేశ చరిత్రలోనే తొలిసారిగా గడిచిన ఈ మూడేళ్ళలో అన్నిరకాలుగా జగన్ మోహన్ రెడ్డి తనదైన రికార్డు సృష్టించుకుంటూ.. తనకు తానే ఒక చోదక శక్తిగా, నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టిన దార్శనికుడిగా.. చిన్న వయసులోనే నిజమైన ప్రజా నాయకుడిగా, దేశంలోనే ఒక అరుదైన రాజనీతిజ్ఞుడుగా నిలబడ్డారు.
జగన్ మోహన్ రెడ్డిగారితో పాటు నడిచే పార్టీలో ఒక కార్యకర్తగా, జర్నలిస్టు అనుభవంతో, ఒక సాక్షిగా ఆయనను చూస్తుంటే, ఇదంతా కేవలం మూడేళ్ళలోనే కళ్ళ ముందు కనిపిస్తుంటే గర్వంగా ఫీలవుతున్నాం.
2. దివంగత నేత వైయస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే లక్షలాది కుటుంబాలు మాత్రమే కాకుండా, ఈ మూడేళ్ళలో ఏం జరిగింది.. ? అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే.. మాఫియా ముఠా లాంటి పాలన(చంద్రబాబు) నుంచి, చీకటి తర్వాత తొలి పొద్దు పొడిచినట్టు.. ఒక స్తబ్ధత నుంచి చైతన్యం వైపు అడుగులు వేసినట్టు రాష్ట్ర ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై 3 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా నవంబరు 6 నుంచి పార్టీ తరఫున పది రోజులపాటు ప్రజలతోనే మమేకం అవుతూ ప్రజలను చైతన్యపరిచేందుకు, వారికి మేమున్నాం అనే భరోసా కల్పించేందుకు కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. వాటిని రూపొందిస్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళటం అంటే.. మా జబ్బలు మేం చరుచుకునే కార్యక్రమం చేయం.
గడిచిన 14 నెలల పరిపాలనలో మేం ఎంతవరకూ సఫలీకృతం అయ్యాం.. ఇంకా ఏం చేయాలి.. ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా.. ! ఈ అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో పది రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం.
- ప్రభుత్వం అంటే చేతులు దులుపుకుని వెళ్ళేది కాదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజల జీవితాల్లో పర్మినెంట్ గా మార్పు తీసుకురావడం. అలానే రాష్ట్రంలో ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబం అభివృద్ధి కోసం తద్వారా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేయండానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ప్రజలకు తెలియజేసేందుకు, ప్రజలకు ఒక భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
3. గడిచిన మూడేళ్ళు ఏం జరిగిందో ఒక్కసారి నెమరవేసుకుంటే.. 2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర రాష్ట్రంలోని 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగుతూ 14 నెలలపాటు 3,648 కిలో మీటర్లు పొడువున ఇచ్ఛాపురం వరకూ సాగింది. ఎండనకా, వాననకా, జనంలో తాను ఒకడిగా.. 14 నెలలపాటు జగన్ మోహన్ రెడ్డిగారు ప్రజల్లోనే ఉన్నారు.
రాత్రిపూట గుడారాల్లో బస చేస్తూ.. ఒకవైపు పార్టీని నడపడం, మరోవైపు భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు రూపొందించుకుంటూ, ఇంకోవైపు ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ ఒక మహాయజ్ఞం తరహాలో జగన్ మోహన్ రెడ్డిగారు ముందుకు వెళ్ళారు. బహుశా ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా జగన్ గారు.. ఒకే జాబితాలో 175మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించడం చూశాం. ఇదీ ఒక చరిత్రే.
4. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూనే, సమర్థవంతంగా పార్టీని నడుపుతూ.. కొన్ని లక్షల మంది ప్రజలను నేరుగా కలిసి, వారి సమస్యలు వింటూ.. ఆ తర్వాత మరో మూడు నెలలపాటు ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల్లో 151 సీట్లతో, 22 మంది ఎంపీలను గెలిపించి, అఖండమైన మెజార్టీతో గెలిచి మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 17 నెలలుగా పరిపాలన చేస్తున్నారు. మొదటి 14 నెలలు జనంలో ఉండి.. మరో 17 నెలలుగా జనం కోసం ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజలకోసమే పూర్తిగా అంకితం అవుతూ పరిపాలన సాగిస్తున్నారు.
5. జగన్ మోహన్ రెడ్డిగారు నిత్యం జనంతో మమేకం అవుతూ, తన ఆలోచనలకు తోడు ప్రజల నుంచి వచ్చిన ఆలోచనలు, ఓదార్పు యాత్రలో తనకు వచ్చిన అనుభవాలను జోడించుకుని నాలుగే నాలుగు పేజీల్లో(రెండు పెద్ద పేజీల్లో) మేనిఫెస్టోను రూపొందించుకోవడం కూడా ఒక రికార్డే. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ.. ప్రజల్లో మౌలిక మైన మార్పును తీసుకొచ్చి.. అభ్యుదయకరమైన దశకు తీసుకువెళ్ళే విధంగా ఉంది.
మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను, ఆశలను నెరవేర్చే విధంగా తీర్చిదిద్దారు. అలానే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిన్నరలోనే 90 శాతంకు పైగా మేనిఫెస్టో హామీలు అమలు చేయడం మరో రికార్డు సాధించారు. 17 నెలల జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలనలో ఎన్నో ఊహించని మార్పులు ప్రజా జీవితంలో జరిగాయి. ఈ క్రమంలో ఎన్నో సంక్షోభాలు ఎదురైనా.. ఒక ధీశాలిగా జగన్ గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలిస్తూ, ప్రజలు మెచ్చే విధంగా చేస్తున్న పాలన చూస్తున్నాం.
6. ప్రజా జీవనంలో సమూలమైన మార్పు తెచ్చే విధంగా చెప్పుకోగలిగింది.. రాష్ట్రంలో నూతన వ్యవస్థలు సృష్టి. పరిపాలనలో వికేంద్రీకరణ. సచివాలయాల ద్వారా గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పరిపాలనను తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత ఉద్యోగాలైతేనేమీ, వాలంటీర్లు అయితేనేమీ మొత్తం 4 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగావకాశాలు కల్పించారు.
ఇందులో 82 శాతం బడుగు, బలహీన వర్గాలకు ఉద్యోగాలు దక్కాయి. మహిళలకు 50 శాతం దక్కాయి. గ్రామ సచివాలయాలు.. ఈరోజు గ్రామస్థాయిలో సేవాలయాలుగా మారి, దరఖాస్తు చేసిన 10-15 రోజుల్లోనే రేషన్ కార్డు దగ్గర నుంచి పెన్షన్లు, ఇళ్ళ పట్టాలు, ఆరోగ్యశ్రీ కార్డులు.. ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దకే వాలంటీర్ల ద్వారా అందుతున్నాయి.
ఇవన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్న నిజాలు. వాస్తవానికి, ఇవన్నీ చేయాలంటే మూడేళ్ళు, నాలుగేళ్ళు, అంతకుమించి పట్టే చర్యలన్నింటినీ, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఒక్కో నూతన పథకాన్ని.. వ్యవస్థల్ని ప్రారంభిస్తూ, ఎంతో గుండె నిబ్బంతో తొలి ఏడాదిన్నరలోనే అద్భుతాలు సృష్టించిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
7. ఇంతకాలం ఎన్నికల వాగ్దానాలంటే.. సెల్ ఫోన్లు ఇస్తానని చెప్పడం, గ్రైండర్లు ఇస్తానని చెప్పడం.. ఇలా ప్రజాకర్షక హామీలు ఇచ్చేవారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే వాగ్దానాలు చేసి, ఏడాదిన్నరకాలంలోనే వాటిని అమలు చేసి, ఆ మార్పు వారి అభ్యున్నతికి, తద్వారా సమాజం అభివృద్ధికి ఉపయోగపడేవిధంగా చేశారు.
ఎన్టీఆర్ మండల వ్యవస్థను తీసుకొచ్చినా.. దాని నుంచి వచ్చే మేళ్ళు ఉన్నప్పటికీ, ప్రజల జీవితాల్లో అంతగా మార్పు రాలేదు. వైయస్ఆర్ గారి హయాంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి విద్య, వైద్యం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి కొంత ముందుకు వెళ్ళారు. ఈరోజు ప్రభుత్వమే ఒక చోధక శక్తిగా, ఫెసిలిటేటర్ గా ఉండటం ఈ ఏడాదిన్నరలో కనిపించింది.
గతంలో ఒక రేషన్ కార్డు కావాలన్నా, కులం సర్టిఫికేట్ కావాలన్నా, ఇంటి స్థలం పట్టా కావాలన్నా ప్రజలు పోరాడాల్సి వచ్చేది. ఇప్పుడు అర్హత అనేది కొద్దిరోజులు, కొద్ది ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. 360 రోజులు, 24 గంటలు తరహాలో, పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు సకాలంలో అందుతున్నాయి. ప్రభుత్వ పథకాలకు అర్హులు ఎంపిక అన్నది ఒన్ టైమ్ కాదు.. కంటిన్యూగా జరిగే కార్యక్రమంలా చేస్తున్నాం. మొన్ననే 6 లక్షల మంది రైతుల్ని రైతు భరోసాలో కొత్తగా ఎన్ రోల్ చేశాం.
8. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ ఫర్ అన్నది ఎప్పుడన్నా కలగన్నామా..! గతంలో ఎప్పుడూ లేదు. నేరుగా సీఎం గారు ఒక్క బటన్ నొక్కగానే.. ఒక్కరోజులోనే లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు వెళుతున్నాయి. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే.. జగన్ కి ఉన్న తపన, పేద, బడుగు, బలహీన,మైనార్టీ వర్గాల ప్రజల పట్ల ఆయనకు ఉన్న బాధ్యత, చిత్తశుద్ధి.
అలానే ఏడాదిలోనే వ్యవస్థల్లో ఎన్నో మార్పులు తెచ్చాం. ప్రాజెక్టులు, కాంట్రాక్టు పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ద్వారా ఫస్ట్ టైమ్ వేల కోట్లు ఆదా చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు మేలు చేసే ప్రభుత్వంగా కాకుండా.. తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా చేస్తున్నాం.
9. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి 96 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు దిగిపోయే నాటికి అది రూ. 2.60 లక్షల కోట్లకు చేరి, మరో రూ. 60 వేల కోట్లు పెండింగ్ బిల్లులతో ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారైంది. చంద్రబాబు హయాంలో ఈ డబ్బు అంతా ఎక్కడికి పోయింది, ఎక్కడా కనిపించటం లేదు... అని ఆర్థిక నిపుణులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి.
ఇప్పుడేమో ప్రతిదీ ట్రాన్సపరెంట్. ఇన్ని పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారు అసలు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తున్నారు.. ఎలా చేస్తున్నారు అని మాట్లాడేవారే తప్ప.. ఎక్కడికి పోతుందని ఏ ఒక్కరూ విమర్శించే పరిస్థితి లేదు. చంద్రబాబు హయాంలో పది రూపాయల పనిని వంద చేసి దోచుకుతిన్నారు.
10. కుటుంబం ఒక యూనిట్, విలేజ్ ఒక యూనిట్ గా జగన్ మోహన్ రెడ్డి చేసిన యజ్ఞం వల్లే.. ఏడాదిన్నర పరిపాలనలోనే ఎన్నో ఫలితాలు వచ్చాయి. సమాజంలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు ఇంగ్లీషు మీడియం విద్య, ఇళ్ళు లేని నిరుపేదలకు 30 లక్షల ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ నిర్మాణం.. ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే, ప్రభుత్వం చేస్తున్న మంచిని అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రతిదానిలో ఆటంకాలు కలుగుజేస్తుంది.
విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడకు వెళ్ళి సెటిల్ కావాలన్నా, ఉన్నతంగా ముందుకు వెళ్ళాలన్నా ఇంగ్లీషు మీడియం తప్పనిసరి పరిస్థితిల్లో, ఆ చదువు కొనుక్కోవడానికి పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎంతగా కష్టపడాల్సి వస్తుందో చూస్తున్నాం. సర్కారు బడుల్లోనే ఇంగ్లీషు మీడియం పెట్టి.. కార్పొరేట్ స్కూళ్ళ తరహాలో నాడు-నేడు ద్వారా వాటిని అభివృద్ధి చేస్తే విద్యార్థులు ఎందుకు రారు అన్న ధైర్యంతో జగన్ ముందుకు వెళుతుంటే.. మాతృ భాషను తెరపైకి తెచ్చి కొన్ని దుష్ట శక్తులు వెనక్కి లాగుతున్నాయి.
4 ఏళ్ళ తర్వాత, ఎన్నికల ఏడాదిలో పథకాలు అమలు చేసి, ఓటరును మభ్య పెట్టే పార్టీలనే ఇంతకాలం చూశాం. కానీ జగన్ గారు అటువంటి పాత చింతకాయ సిద్ధాంతాలను పట్టించుకోకుండా, అధికారం చేపట్టిన ఏడాదిలోనే కమిట్ మెంట్ తో పథకాలను అమలు చేస్తున్నారు.
- ప్రభుత్వ ఆసుపత్రులను సైతం నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. నాడు ఆరోగ్యశ్రీ కింద వెయ్యి జబ్బులు ఉంటే.. ఇప్పుడు 2000 జబ్బులను చేరుస్తూ, రూ 5 లక్షలు ఆదాయం లిమిట్ అంటే.. నెలకు రూ 40 వేలు జీతం వచ్చే వాళ్ళకు కూడా, రూ. 1000 దాటితే ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం చేస్తున్నాం.
డబ్బుతో సంబంధం లేకుండా, ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత అప్పులు ఎలా తీర్చాలన్న బెంగ లేకుండా, ఏఎన్ ఎం నుంచి డాక్టర్ వరకూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు అందిస్తున్నాం. అలానే కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నాం. ఏడాదిన్నరలోనే ఇన్ని మార్పులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. అంగన్ వాడీ కేంద్రాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాలతో పిల్లలకు ఆరోగ్యం అందిస్తున్నాం.
11. ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదల పక్షపాతి ప్రభుత్వం. నిన్ననే 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చాం. అమ్మఒడి, ఆసరా, చేయూత.. పేదవాళ్ళకు ఇళ్ళు.. ఇలా ఏ పథకం తీసుకున్నా మహిళలకే పెద్ద పీట వేస్తున్నాం. ఈరోజు మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ చేయించి వారిని ఆర్థికంగా శక్తివంతులను చేస్తున్నాం.
12. జగన్ మోహన్ రెడ్డిగారికి ఇంత కమిట్ మెంటు ఉద్యమాలు చేస్తే వచ్చింది కాదు.. తన తండ్రి రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని.. తన తండ్రి రాజశేఖరరెడ్డి ఏవిధంగా అయితే కోట్ల మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారో, అలానే తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా ఉండాలని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో తండ్రిమాదిరిగా తాను నిలిచిపోవాలని, నిత్య విద్యార్థిలా, నిత్య కృషీవలుడుగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు.