Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హమ్మయ్య, తిరుమలలో మొదటి ప్రభుత్వ కార్యాలయం, ఎంతమంది స్థానికులు, ఓటర్లో తెలుసా?

హమ్మయ్య, తిరుమలలో మొదటి ప్రభుత్వ కార్యాలయం, ఎంతమంది స్థానికులు, ఓటర్లో తెలుసా?
, గురువారం, 8 జులై 2021 (21:24 IST)
తిరుమలలో మొదటి ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటైంది. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పట్టుబట్టి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యే మార్గం సుగమమైంది.
 
ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే తిరుమలలో స్థానికులు పెద్ద సంఖ్యలోనే నివాసాలు ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో అసలు తిరుమలలో స్థానికులు ఉన్నారా అని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
1910 వరకు తిరుమలలో ఎవరూ పెద్దగా నివాసముండేవారు కాదు. స్వామివారికి పూజాది కార్యక్రమాలను తిరుపతి నుంచి వచ్చి నిర్వహించేవారు అర్చకులు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వన్యమృగాల సంచారం ఎక్కువగా ఉండేది. అటవీ జంతువుల కారణంగానే తిరుమలలోనే నివశించడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించేవారు కాదు.
 
ఆ తరువాత కొన్నేళ్ళకు తిరుమలలో నివాసముండేవారు ప్రారంభమయ్యారు. ఇది కాస్త క్రమంగా ప్రారంభమవుతూ వచ్చింది. అలా ఒకదశలో తిరుమలలో నివాసముండేవారి స్థానికుల సంఖ్య 30 వేలకు చేరుకోగా ఓటర్లు 20 వేల మంది ఉన్నారు. టిటిడిని బ్రిటీషు ప్రభుత్వం 1933లో ఏర్పాటు చేయగా 1953 నుంచి పరిపాలన సౌలభ్యం కోసం పాలకమండలిని ప్రభుత్వం నియమిస్తూ వచ్చింది.
 
మొదట్లో తిరుపతి గ్రామపరిధిలోనే ఉండేది. 1964లో తిరుమలను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అప్పటి టిటిడి ఈఓ నరసింహరావును ఎన్నికల అధికారిగా నియమిస్తూ ఎన్నికను రద్దు చేసింది ప్రభుత్వం. నాటి నుంచి టిటిడి ఈఓనే పంచాయతీ అధికారిగా ఉంటూ వస్తున్నారు. 
 
దీంతో తిరుమల ఓటర్లు ఎంపి, ఎమ్మెల్యేను ఎన్నుకునే అధికారం లభించగా పంచాయతీలు మాత్రం ప్రాతినిథ్యం కోల్పోయారు. ఆ తరువాత మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి స్థానికులను తిరుపతికి తరలించడం ప్రారంభించింది. తిరుమలలో స్థానికుల ప్రాతినిథ్యం తగ్గుతూ వచ్చింది.
 
ప్రస్తుతం స్థానికులు బాలాజీనగర్‌లో 1080 నివాసాలు, ఆర్‌బీ సెంటర్లో 81 నివాసాలు ఉండగా టిటిడి ఉద్యోగులు పరిమిత సంఖ్యలో క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. దీంతో 2019కి తిరుమలలో ఓటు హక్కు వారి సంఖ్య 5,164కి పడిపోయింది. ఇక పంచాయతీ ఈఓగా టిటిడి ఈఓనే ఉండటంతో తిరుమలలో కార్యాలయాలకు చోటు లేకుండా పోయింది.
 
అప్పట్లో స్థానికులలో తిరుపతికి తరలించాలని యోచనలో ఉన్న టిటిడి అధికారులు ప్రభుత్వ పథకాలను వారికి అందకుండా చేశారు. తిరుమల స్థానికులకు కొన్నేళ్ళ వరకు రేషన్ కార్డులు లేవు. ఎప్పుడైతే కేంద్రం ఆధార్ కార్డుల జారీ ప్రారంభించిందో అప్పటి నుంచి స్థానికులకు గుర్తింపు లభించింది.
 
ఫలితంగా తిరుమలలో స్థానికులు నివాసముంటున్నారనే విషయాన్ని అధికారులు గుర్తించాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పథకాలను అందించడానికి వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. తిరుమలకు వాలంటీర్లను నియమించినా గ్రామ సచివాలయం ఏర్పాటు కాలేదు. 
 
స్థానిక ఎమ్మెల్యే భూమన ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. అదే  సమయంలో తిరుమలలో స్థానికులు ఉన్నారా అంటూ స్పీకర్ సంశయం వ్యక్తం చేశారట. ఎట్టకేలకు ఎమ్మెల్యే విజ్ఞప్తితో ప్రభుత్వం స్పందించింది. తిరుమలకు రెండు గ్రామసచివాలయాలను మంజూరు చేసింది. ఇకపై స్థానికులకు గుర్తింపుతో పాటు పథకాలు కూడా అందే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 2,982 కరోనా కేసులు.. 27 మరణాలు