Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల కొండపై ఉచిత సేవలకు తిలోదకాలు... ఏజెన్సీలకు అప్పగింత...

తిరుమల కొండపై ఉచిత సేవలకు తిలోదకాలు... ఏజెన్సీలకు అప్పగింత...
, శుక్రవారం, 2 జులై 2021 (11:56 IST)
తిరుమల కొండపై ఉచిత సేవలకు స్వస్తి చెప్పారు. తితిదేలో కౌంటర్ల నిర్వహణకు సంబంధించి ఉచిత సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఈ కౌంటర్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించారు. 
 
నిజానికి గతంలో వీటిని బ్యాంకులు, త్రిలోక్‌ అనే సంస్థ ఉచితంగా నిర్వహిస్తూ వచ్చింది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లతో పాటు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే భక్తులకు టోకెన్లు ఇచ్చేవి. 
 
అయితే ఇపుడు వైకుంఠం క్యూకాంప్లెక్సులో దర్శన టికెట్ల స్కానింగ్‌, తిరుపతిలోని ఎస్‌ఎస్‌డీ కౌంటర్లు, అలిపిరి టోల్‌గేట్‌ వద్దనున్న కౌంటర్లను కేవీఎం ఇన్‌ఫో(బెంగళూరు) అనే మెన్‌పవర్‌ ఏజెన్సీకి అప్పగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో అదనపు ఈవో ధర్మారెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఏజెన్సీ సిబ్బందితో సేవలను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు విశేష సేవలందిస్తున్న పలు కౌంటర్లను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వృత్తి నిపుణత కలిగిన ఏజెన్సీలు అవసరమన్నారు. అతితక్కువ ధరకు కేవీఎం ఇన్‌ఫో టెండరు వేసిందన్నారు. ఇకపై ఆ ఏజెన్సీతో టీటీడీలో భక్తులకు సేవలందించే కౌంటర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
 
తిరుపతి, తిరుమలలోని 164 కౌంటర్లను మూడు షిఫ్టులలో నడిపేందుకు 430 మంది సిబ్బంది అవసరమన్నారు. ఈ సిబ్బందికి వారంపాటు శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రొటేషన్‌ పద్ధతిలో ప్రతి వారం సిబ్బందిని మార్చనున్నట్టు వివరించారు. కౌంటర్ల నిర్వహణ కోసం బ్యాంకులు స్వచ్ఛందంగా ముందుకొస్తే అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విదేశీయులకు వీధికుక్కలు స్వాగతం పలకడమా.. రాజమౌళి స్వీట్ వార్నింగ్