Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఆపోజిట్ రాధా కాదు... ల‌గ‌డ‌పాటి పెద్ద కొడుకు!

Advertiesment
వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఆపోజిట్ రాధా కాదు... ల‌గ‌డ‌పాటి పెద్ద కొడుకు!
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (12:06 IST)
నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు వంగ‌వీటి రాధాపై తెలుగుదేశం ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపైకి రాధాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో తూరుపు ముక్క‌లా ప్ర‌యోగిద్దామ‌ని అనుకుంది. కానీ, తాజాగా విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేంద్రబిందువుగా పెను మార్పులు, ఈక్వేషన్లను సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ మాత్రం కొరుకుడు పడని గన్నవరం నియోజకవర్గంపై టీడీపీ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలను మొదలు పెట్టింది. టీడీపీకి ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోవడం అత్యంత ప్రతిష్ఠాత్మకం కావడం వల్ల బలమైన నాయకుడి కోసం కొన్నాళ్లుగా చేస్తోన్న ప్రయత్నాలు ఇపుడు క్లియ‌ర్ అయ్యాయ‌ని చెపుతున్నారు. 
 
 
గ‌న్నవరం అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు బలంగా ఉన్న స్థానం ఇది. మెజారిటీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ వైపే ఉంది. వల్లభనేని వంశీ ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని టీడీపీ విజయం సాధించిన స్థానాల్లో ఇదీ ఒకటి. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో వల్లభనేని వంశీ పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పారు. వైఎస్ఆర్సీపీలో అనధికారికంగా కొనసాగుతున్నారు. ఎన్నికల తరువాత టీడీపీ నుంచి బయటికి వచ్చిన మొట్టమొదటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే. వంశీ ఇచ్చిన షాక్‌ నుంచి టీడీపీ అగ్ర నాయకత్వానికి ఇప్ప‌టికీ తేరుకోలేదు. 
 
 
2009 ఎన్నికలను కూడా కలుపుకొంటే వరుసగా మూడుసార్లు తమ పార్టీని గెలిపించిన ఈ నియోజకవర్గాన్ని తిరిగి చేజిక్కించుకోవాల‌ని గెలుపు గుర్రం కోసం తెలుగుదేశం పార్టీ అన్వేషణ చేస్తోంది. దీనికి వంగ‌వీటి రాధాని ఎంపిక చేశార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఇపుడు కొత్త‌గా కమ్మ సామాజిక వర్గానికే చెందిన బలమైన నాయకుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
 
 
కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, విజయవాడ లోక్‌సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కుమారుడు ల‌గ‌డ‌పాటి ఆశ్రిత్ కి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ బాధ్యతలను ఇవ్వాలని టీడీపీ అగ్రనాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై లగడపాటితోనూ సంప్రదింపులు, చర్చలు ముగిశాయని సమాచారం. తన కుమారుడు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పగ్గాలను అందుకోవడానికి లగడపాటి రాజగోపాల్ కొన్ని షరతులు పెట్టారని, దీనికి టీడీపీ అగ్రనాయకత్వం అంగీకరించిందనే ప్రచారం సాగుతోంది. లగడపాటికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి గన్నవరం టికెట్ ఇవ్వాలనే అభిప్రాయానికి టీడీపీ వచ్చిందని సమాచారం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో లగడపాటి కుటుంబం ఒక్కటే వల్లభనేని వంశీని ఢీ కొట్టగలదని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ హవా బలంగా వీచిన సమయంలోనూ వల్లభనేని వంశీ గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వరుసగా రెండుసార్లు ఇదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు
 
 
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంశీ పోటీ చేయడం ఖాయం. గన్నవరం అసెంబ్లీ స్థానం పరిధిలో టీడీపీ అభ్యర్థిగా కంటే, వల్లభనేని వంశీకి వ్యక్తిగతంగా ఉన్న ప్రతిష్ఠ, పట్టు వల్లే ఆయన గెలుపు సాధ్యపడిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా,  తాను గెలవగలిగేలా బలమైన ఓటు బ్యాంకును వంశీ సృష్టించుకున్నారు. ఇలాంటి నాయ‌కుడిని ఎదుర్కోనేందుకు ల‌గ‌డ‌పాటి పెద్ద కుమారుడిని రంగంలో దింపాల‌ని తెలుగుదేశం భావిస్తున్న‌ట్లు స‌మ‌చారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోదీ కారు అప్ గ్రేడ్-ఫీచర్స్