Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జిఎస్టీ పెంపు చేనేత రంగానికి మరణ శాసనం: లోకేష్

Advertiesment
tdp national general secretary
విజ‌య‌వాడ‌ , సోమవారం, 27 డిశెంబరు 2021 (14:56 IST)
బ‌ట్ట‌ల‌పై జీఎస్టీ పెంపు చేనేత రంగానికి మరణశాసనంగా మారింద‌ని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జ‌గ‌న్ కి లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింద‌ని అన్నారు.  
 
 
చేనేత రంగానికి అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోళ్లు, నేతన్నలకు ప్రోత్సాహకాలు లాంటి అనేక కార్యక్రమాలను వైసిపి ప్రభుత్వం నీరుగార్చడమే చేనేత రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అని పేర్కొన్నారు. 
 
 
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత ఉత్పత్తుల పై 5 శాతం జీఎస్టీ విధించడమే పెనుభారమైతే ఇప్పుడు ఏకంగా దానిని 12 శాతానికి పెంచడం మరణశాసనమే అని లోకేష్ చెప్పారు. రంగులు, రసాయనాలు, నూలు ధరలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో లాభం 2 నుండి 5 శాతం రావడమే గగనంగా మారింద‌న్నారు. తాజా జీఎస్టీ పెంపు నిర్ణయంతో చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా ఆ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింద‌ని తెలిపారు. 
 
 
తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒత్తిడి పెంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తుంద‌ని లోకేష్ విమ‌ర్శించారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాల‌ని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే చేనేత రంగంపై జీఎస్టీ భారం 5 శాతాన్ని మించకుండా సబ్సిడీలు కల్పించాల‌న్నారు.  
 
 
చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు ఆప్కో ని సమర్థవంతంగా వినియోగించాల‌ని, చేనేత కళని కాపాడటానికి గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఆప్కో ద్వారా కొనుగోళ్లు, నేతన్నలకు ప్రోత్సాహకాలను తిరిగి అమలు చెయ్యాల‌ని డిమాండు చేశారు. 
 
 
భారతదేశ వస్త్ర సంప్రదాయంలో ఆంధ్రప్రదేశ్ చేనేతకు ప్రత్యేక స్థానం ఉందని, ఎంతో ఘన చరిత్ర ఉన్న చేనేత కళను, నేత కళాకారులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద‌న్నారు. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాల‌ని, నేత కళాకారులని గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాల‌ని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీ బస్సుల్లో పది రూపాయల నాణేలను తీసుకోవాల్సిందే