Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి స్కాం నుంచి దృష్టిమళ్లించేందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ కథలు: హోంమంత్రి సుచరిత

Advertiesment
అమరావతి స్కాం నుంచి దృష్టిమళ్లించేందుకే  ఫోన్‌ ట్యాపింగ్‌ కథలు: హోంమంత్రి సుచరిత
, మంగళవారం, 18 ఆగస్టు 2020 (23:10 IST)
ఏపీ హోంమంత్రి సుచరిత చంద్రబాబు పై మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. "ప్రతిపక్ష నాయకుడు  చంద్రబాబు నాయుడు ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి చేసిన ఆరోపణల నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిందిగా హోంమంత్రిగా నేను, రాష్ట్ర డీజీపీ వారికి విజ్ఞప్తిచేసి 24 గంటలు గడిచిపోయింది.

వారు ఈ క్షణం వరకూ ఎటువంటి ఆధారాలూ సమర్పించలేదు. అయితే కొన్ని మీడియా సంస్థలతో కలిసి వారు చేస్తున్న ఒక కుట్రపూరితమైన ప్రచారం వెనుక ఏ వ్యూహందాగిఉందన్న అంశాన్ని రాష్ట్రప్రజలముందు ఉంచటం నా విధిగా భావిస్తున్నాను. మీ అందరికీ తెలుసు.

అమరావతిలో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు ఎంతటి భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నది గతంలో మేం, మాతోపాటు మరికొన్ని ప్రతిపక్షాలు కూడా స్పష్టంచేయటం జరిగింది.

అయితే అందుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణను మేం అధికారంలోకి రాగానే చేపడతామని చెప్పిన మేరకు రాష్ట్ర పోలీసులోని సంబంధిత విభాగాలు ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి విచారణను ఒక కొలిక్కి తీసుకు వస్తున్న మీదట, ఒక నివేదిక సిద్ధం కాబోతున్న మీదట చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు ఈ నివేదికలో నిజాలను ప్రజలకు తెలియకుండా మరుగుపరచాలన్న దురుద్దేశంతో పెద్ద కుట్రకు తెరతీసినట్టుగా మాకు కనిపిస్తోంది.

ఇంటా, బయటా తనకున్న పరిచయాలను, తనకు సహకరించే వారిని ఉపయోగించుకుంటూ, మీడియా సంస్థలతో కలిసి చేస్తున్న ఈ కుట్ర వల్ల ఆయన పొందాలనుకుంటున్న ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో పొందజాలరని స్పష్టంచేస్తున్నాను.

అమరావతి భూముల చుట్టూ అసలైన కుంభకోణాన్ని వెలికి తీయకుండా నిరోధించేందుకు, దర్యాప్తు ముందుకు సాగనీయకుండా అడ్డుకునేందుకు, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం మీద ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల ద్వారా వారిని లక్ష్యంగా చేసుకుని, వారి స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఈ కుట్రపూరిత వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

ఇందులో చంద్రబాబు మీడియా భాగస్వాములు, మరికొందరు ఇంటా, బయటా సహకరించే వ్యక్తులు ఉన్నారని అందరికీ అర్థమవుతోంది. కాబట్టి చట్టవిరుద్ధమైన ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందనేది అబద్ధం. ఈ విషయాలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను.

అమరావతి ల్యాండ్‌ స్కాంనుంచి తప్పించుకునేందుకు ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు, ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు తప్పించుకోలేరని, అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టంచేస్తున్నాను" అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నలుగురికి 32ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం..ఎవరు?