జగన్‌కు అమరావతి అంటే ఎందుకింత ద్వేషమని, రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఎవరిచ్చారని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.
వైసిపి ప్రభుత్వం చేసేందంతా తప్పుల మీద తప్పులు, బయటకు చెప్పేదంతా మాయ మాటలని ఆయన పేర్కొన్నారు. అమరావతి కోసం పోరాడకపోతే భవిష్యత్తు తరాలకు నష్టం చోటుచేసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రం మధ్యలో ఉండే అమరావతిని అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే రాష్ట్ర రాజధానిగా నిర్ణయించామని,
13 జిల్లాల అభివృద్ధి కోసం 160 ప్రాజెక్టులు చేపట్టామని, కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాజెక్టులూ పూర్తయితే అదే నిజమైన వికేంద్రీకరణ అవుతుందన్నారు. అమరావతిని కాపాడుకునేందుకు రాష్ట్రంలోని యువత, మేధావులు, మీడియా, అన్ని తరగతుల ప్రజలు పోరాటానికి కలిసికట్టుగా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పోర్టుల అభివృద్ధికి కృషి చేశామని, నదుల అనుసంధానం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. 63 ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిజైన్ చేశామని, ఇందులో 23 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు.
తమ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు రూపకల్పన చేశామని, అమరావతికి 139 ప్రాజెక్టులను తీసుకొచ్చామన్నారు.
అమరావతి రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు భూములిచ్చారని, రాజధాని అభివృద్ధి చేయగా సుమారు 8,250 నుంచి 9 వేల ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుందన్నారు. ఆ భూమితో ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చేయవచ్చన్నారు.
2019లో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు వైసిపి ప్రభుత్వ చేతగానితనం వల్ల 2020 పూర్తి కావస్తున్నా పూర్తి కాలేదన్నారు.