ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు వెళ్లిన తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వర రావుపై జి.కొండూరు పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు. ఈ కేసుతో పాటు.. 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు.
ఈ కేసులో మంగళవారం అర్థరాత్రి ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదపారపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
మరోవైపు, దేవినేని ఉమ అరెస్టుపై టీడీపీ సీనియర్ నేతలు మండిపడ్డారు. దేవినేని ఉమపై దాడి అమానుషమని వ్యాఖ్యానించారు. వైకాపా గూండా రాజకీయాలను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి చిన్నరాజప్ప అన్నారు. ఒక్కరిపై 100 మంది దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రోద్బలంతోనే ఉమపై దాడి జరిగిందని ఆరోపించారు. దాడి జరుగుతుందని తెలిసి కూడా వైకాపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకోలేదని మండిపడ్డారు.
వైకాపా పాలనతో అవినీతి రాజ్యమేలుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. సహజవనరుల దోపిడీని అడ్డుకుంటే దాడులా? అని ప్రశ్నించారు. నిందితులను వదిలేసి భాధితులను అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు.
వసంత కృష్ణప్రసాద్ కనుసన్నల్లోనే గ్రావెల్‌ను దోచుకుంటున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోందన్నారు. దేవినేనిని వదిలిపెట్టి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.