Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకటో తారీఖున జీతాలు వస్తాయనే మాటను ఉద్యోగులు మరిచిపోయారు.. పవన్ కళ్యాణ్

Advertiesment
ఒకటో తారీఖున జీతాలు వస్తాయనే మాటను ఉద్యోగులు మరిచిపోయారు.. పవన్ కళ్యాణ్
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (14:59 IST)
ఏపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు రెచ్చిపోయారు. ప్రభుత్వ వైఖరిని తూర్పూరబట్టారు. ఒకటో తారీఖున జీతాలు వస్తాయనే మాటను ప్రభుత్వ ఉద్యోగులు మరచిపోయేలా చేశారని వైసీపీ సర్కారును విమర్శించారు. జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని, ఈ అనిశ్చితి ఏపీ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ లేమిని సూచిస్తోందన్నారు. 
 
ఆయన శుక్రవారం మాట్లాడుతూ, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడంలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో అందించడంలేదని జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందకపోవడం బాధాకరమన్నారు. 
 
దశాబ్దాల పాటు ఉద్యోగ సేవలు అందించి విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటారని తెలిపారు. వృద్ధాప్యంలో వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయని, ఆ ఖర్చులకు పెన్షన్ డబ్బులే ఆధారమని పవన్ గుర్తుచేశారు. వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోతే వారు ఎంతో మానసిక వేదనకు గురవుతారన్నారు. 
 
తన తండ్రి కూడా ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైరయ్యారని, ఆయన ఎంత ఆత్మాభిమానంతో ఉండేవారో తాను చూశానని, రిటైర్డ్ ఉద్యోగులు తమ జీతం మీద, పెన్షన్ మీద ఎంతో ఆత్మాభిమానంతో జీవిస్తారని వివరించారు. నిర్దేశిత సమయానికి ఆ డబ్బు చేతికి అందకపోతే ఎంతకాలం వారు చేబదుళ్లతో నెట్టుకురావాలి? అని ప్రశ్నించారు.
 
నిరంతరం ఉద్యోగ విధుల్లో ఉండే పోలీసులకు గడచిన 11 నెలలుగా టి.ఏ కూడా లభించకపోవడం విచారకరమన్నారు. పోలీసుల ఇబ్బందులు తన దృష్టికి వచ్చినందునే అనంతపురం జిల్లా కొత్తచెరువు సభలో ప్రస్తావించానని తెలిపారు. జీతం ఇవ్వడం ఆలస్యం చేస్తే డి.ఏ, టి.ఏ, పీఆర్సీ అడగరని, జీతం ఇస్తే అదే పది వేలు అని ఉద్యోగులు భావిస్తారని ప్రభుత్వం అనుకుంటోంది అని పవన్ అన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వానికి నెలసరి ఆదాయం గతేడాది కంటే పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయని, మరి ప్రభుత్వ నిర్వహణలో భాగమైన జీతభత్యాల చెల్లింపులు కూడా చేయడంలేదంటే ఆ ఆదాయం ఎటుపోతోందని ప్రశ్నించారు. ప్రతి నెల తెస్తున్న అప్పులు ఏమైపోతున్నాయని  పవన్ కళ్యాణ్ నిలదీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహం పేరుతో.. స్నేహితుడి భార్యతో ఆ సంబంధం.. రాడ్‌తో?